ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మద్యం కుంభకోణం అంశం ఈ వార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మాజీ ఎంపీ కేశినేని నాని.. తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై నేరుగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఎక్స్‌ను వేదికగా చేసుకున్నారు. ఎక్స్‌లోనే తన సోదరుడిపై ఆరోపణలు చేస్తూ నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు.
నాని ఆరోపణలు చూస్తే.. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో ఎంపీ చిన్ని, ఆయన భార్య జానకీ లక్ష్మీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వీరిద్దరూ కలిసి “ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP” అనే సంస్థలో భాగస్వాములని కేశినేని నాని వెల్లడించారు.
ఈ సంస్థ, లిక్కర్ స్కాంలో మరో అనుమానిత సంస్థ “ఇషాన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్” ఒకే చిరునామా, ఒకే ఇమెయిల్ ఐడీ ఉపయోగిస్తున్నాయన్న విషయాన్ని నాని బయటపెట్టారు. అంతేకాదు, చిన్ని తనకు అక్రమంగా లభించిన డబ్బును హైదరాబాద్ రియల్ ఎస్టేట్, విదేశీ సంస్థలకు మళ్లించారని ఆరోపించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి, అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలంటూ డిమాండ్ చేశారు.
Respected @ncbn garu,
I am writing this to bring to your urgent attention serious and credible information connecting the MP,Vijayawada, Kesineni Sivanath (Chinni), to individuals arrested in the Andhra Pradesh liquor scam, particularly Kesireddy Rajasekhar Reddy and his close… pic.twitter.com/pgiIbNtXZ5— Kesineni Nani (@kesineni_nani) May 5, 2025
మరోవైపు.. ఈ ఆరోపణలపై నాని సోదరుడు ఎంపీ చిన్ని కూడా బహిరంగంగా స్పందించారు. కేశినేని నాని రాజకీయ వ్యభిచారి అని, జగన్ రెడ్డికి గూఢచారి, పార్టీలో ద్రోహి అని అదే స్థాయిలో తీవ్ర ఆరోపణలు చేశారు. నాని ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం తనకు ఉండదని, అయితే, పార్టీ కేడర్‌కు స్పష్టత ఇవ్వాలంటే కొన్ని విషయాలు చెప్పాలంటూ నాని మీద మండిపడ్డారు కేశినేని చిన్ని.
తన వ్యాపార సంస్థకు సంబంధించిన భూమికి పక్కనే కేసిరెడ్డి కంపెనీ స్థలం కూడా ఉండటంతో 2021లో ఇద్దరం కలిసి నిర్మాణం మొదలుపెట్టేందుకు రిజిస్ట్రేషన్ చేశామని, అయితే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తాను అతనితో సంబంధాలు తెంచుకున్నానని, తెలిపారు. నాని ఆరోపిస్తున్న విదేశీ కంపెనీలు, నిధుల మళ్లింపు అన్నీ కల్పితమని కేశినేని చిన్ని ఖండించారు.
అంతేకాకుండా.. తన సోదరుడు కేశినేని నానికి.. ఎంపీ కేశినేని చిన్ని బహిరంగ సవాల్ విసిరారు తనకు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఏవైనా ఆధారాలుంటే వాటిని బయట పెట్టాలని, ఇలా.. సోషల్ మీడియాలో పోస్టులతో భయపెట్టాలని చూస్తే.. ఊరుకోబోనన్నారు.