- భారత్ కు అనుకూల వాతవరణం
- ఖలిస్తాన్ అనుకూల వాదులను ఓడించిన ప్రజలు
- లిబరల్స్ కు 165 స్థానాలు
- కన్సర్వేటివ్స్ కు 147 సీట్లు
- జగ్మీత్ సింగ్ కు కేవలం ఏడు స్థానాలు
- గెలుపుకు 172 స్థానాలు అవసరం
- అమెరికా ట్రేడ్ వార్ ను దీటుగా ఎదుర్కొంటామన్నకార్నే
- కెనడా స్వయం సమృద్దిపైనే దృష్టి
కెనడా ఎన్నికల్లో లిబరల్స్ విజయం సాధించారు. పొరుగుదేశమైన అమెరికా ట్రేడ్ వార్ ప్రకటించిన నేపధ్యంలో ఆ దేశంతో అనుబంధానికి చెక్ పడుతుందన్న భయాందోళనల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో లిబరల్స్ గెలుపొందారు. కొన్నాళ్లుగా ఖలిస్తాన్ అనుకూల వాదులు పెచ్చరిల్లుతున్న ఆ దేశంలో వారికి కూడా ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. ఈఎన్నికల్లో ఖలిస్తాన్ అనుకూలవాది జగ్మీత్ సింగ్ చిత్తు చిత్తుగా ఓడాడు. ఇక తుదివార్తలు అందే సమయానికి 165 జిల్లాల్లో లిబరల్స్ గెలుపొందినట్లు వివిధ వార్తాసంస్థలు ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో కన్సర్వేటివ్స్ కు 147 సీట్లు వచ్చాయి. మరో రెండు పార్టీలైన వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ కు 23 సీట్లు రాగా, జగ్మీత్ సింగ్ కు చెందిన ఎన్డీపి కి కేవలం ఏడంటే ఏడు సీట్లు వచ్చాయి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, సవాళ్లను పరిష్కరించడానికి తమకు పూర్తి అధికారం ఇమ్మని ప్రధాని మార్క్ కార్నే ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. అయితే లిబరల్స్ కు ఇంకా పూర్తి మెజారిటీ రాలేదని వారు 172 స్థానాలు గెలవాల్సి ఉందని సీటీవీ లాంటి మీడియా సంస్థలు చెబుతున్నాయి.
జోక్యాన్ని సహించం…
తనకు మెజారిటీ కట్టబెట్టిన ప్రజలకు ప్రధాని కార్నే కృతజ్ఞతలు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పుడు తామే పెత్తనం పెట్టొచ్చన్న భ్రమలో ఉన్నారని, కానీ అది ఎప్పటికీ జరగదని కార్నే అన్నారు. అమెరికా మోసాన్ని కెనడా ఎప్పటికీ మర్చిపోదని ట్రంప్ తీరునుద్దేశించి కార్నే అన్నారు. ఈ ట్రేడ్ వార్ ను గెలుచుకుంటామని, ట్రంప్ ఆంక్షల నేపధ్యంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు. అమెరికా తమను మోసగించిందని, ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని గుణ పాఠాలు నేర్చుకున్నామని కార్నే అన్నారు. యూరోప్ ఇతర దేశాలతో భాగస్వామ్యాలను మరింత బలపరుచుకుంటామని అన్నారు. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన పోలియవ్రే ఓటమిని అంగీకరించారు. లిబరల్ ప్రభుత్వంతో కలసి పని చేస్తామని, ట్రంప్ ట్రేడ్ వార్ బెదిరింపులను, బంధాలను తుంచేసుకుంటామన్న సవాళ్లను స్వీకరిస్తామని, కెనడాను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసునని అన్నారు. అమెరికాలాగే తమదీ కెనడా ఫస్ట్ నినాదమేనని పొలియవ్రే అన్నారు.ప్రధానితోనూ ఇతర లిబరల్ ప్రభుత్వంతోనూ తమ పార్టీ కలసి పని చేస్తుందని కెనడా ప్రయోజనాలే తమకు ముఖ్యమని తమ సార్వభౌమాధికారాన్ని రక్షించుకుంటూనే సరికొత్త ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటామని అన్నారు.
భారత్ పై ప్రభావం…
కెనడాలో ఉంటున్న ఖలిస్తాన్ అనుకూల వాదులకు కూడా ప్రజలు దిమ్మ తిరిగే షాకిచ్చారు.న్యూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన జగ్మీత్ సింగ్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో తన స్థానానికి రాజీనామా చేశారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిందని, ఇక ముందు తమ పోరాటం ఆపితే తాము ఓడిపోయినట్లేనని అన్నారు. ఈసారి ఎన్నికల్లో లిబరల్స్ గెలుపు కెనడా రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిందన్నారు.ట్రుడో తన రాజీనామాను ప్రకటించిన జనవరి 6న కన్సర్వేటివ్స్ లిబరల్స్ పై 20 పాయింట్లు ఆధిక్యతతో నిలిచారు. అయితే ట్రుడో స్థానాన్ని కార్నే భర్తీ చేయగానే కెనడా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో లిబరల్స్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
వాషింగ్టన్ టారిఫ్ యుద్ధాన్ని తాము దీటుగానే ఎదుర్కొంటామని అయితే కెనడా అమెరికాపై ఆధారపడకుండా స్వయం అభివృద్ధి సాధించడానికి కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కార్నే అన్నారు.9 ఏళ్ల లిబరల్ పాలన తర్వాత మార్పు కావాలన్న ఉద్దేశంతోనే గతంలో కన్సర్వేటివ్స్ భారీ ఆధిక్యంతో గెలిచారు. కానీ వారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆరు టైమ్ జోన్లుగా ఉన్న కెనడాలోని నాలుగు కోట్ల మంది ప్రజల్లో రెండున్నర కోట్లకు పైగానే ప్రజలు ఓటు హక్కును కలిగి ఉన్నారు. 343 మంది సభ్యులు కలిగిన కెనడా పార్లమెంటులో మెజారిటీ రావాలంటే 172 సీట్లు గెలవాల్సి ఉంటుంది. 2015లో లిబరల్స్ గెలవగా, 2019 నుంచి మాత్రం మైనారిటీ ప్రభుత్వంతోనే నెట్టుకొస్తున్నారు.