తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆషాఢమాస బోనాలకు ముహష్ట్రర్తం ఖరారయ్యింది. జూన్ 26వ తేదీ నుంచి జంట నగరాల్లో బోనాలు ప్రారంభమవుతాయి. అదే రోజు గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలిబోనం సమర్పించనున్నారు. జూలై 13వ తేదీన సికింద్రాబాద్ మహంకాళి (లష్కర్) బోనాలు, అదే నెల 20వ తేదీన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం బోనాల క్యాలెండర్ రిలీజ్ చేసింది.
హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు నెలరోజుల పాటు జరగనున్నాయి. జూన్ 26వ తేదీన ప్రారంభం అయ్యే బోనాలు.. జూలై 24 వ తేదీన ముగుస్తాయని దేవదాయ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 26న గోల్కొండ అమ్మవారికి మొదటి పూజతో ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రెండవ పూజ జూన్ 29న, మూడవ పూజ జూలై 3న , నాల్గవ పూజ అదే నెల జూలై 6న , 5వ పూజ జూలై 10వ తేదీన, 6వ పూజ13న, ఏడవ పూజ17న, ఎనిమిదో పూజ 20వ తేదీన జరగనున్నాయి. చివరగా జూలై 24న 9వ పూజ తరువాత బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.
బోనాల పండుగ 19వ శతాబ్దంలో అనగా 1813 ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభమైందని నమ్ముతారు. ఒక కథనం ప్రకారం, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో తీవ్రమైన ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక దళం మహాకాళి అమ్మవారిని తమ ప్రజలను కాపాడమని ప్రార్థించింది. ఒకవేళ ప్లేగు తగ్గిపోతే హైదరాబాద్‌లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని మొక్కుకున్నారు. ప్రజల నమ్మకం ప్రకారం, ప్లేగు వ్యాధి తగ్గిపోయింది, ఆ తరువాత సైనికులు తిరిగి వచ్చి వారు ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాద్‌లో స్థాపించారు. అప్పటి నుండి బోనాలు జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.