25.2 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

కమలం శ్రేణులకు అధిష్టానం సిగ్నల్స్

అదృష్టమంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులదే. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు… ప్రజల్లో తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో పార్టీని పటిష్ట పరచాల్సిన బాధ్యత లేదు. ఢిల్లీలో పార్టీ అధికారంలో ఉంది. అంతా వాళ్లే చూసుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం బీజేపీ అధిష్టానం అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. అప్పుడెప్పుడో 1998లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 18.3 శాతం ఓట్ల తెచ్చుకున్న బీజేపీ ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ తెచ్చుకోలేకపోయింది.  ఆ తరువాత ఏపీలో సింగిల్ డిజిట్ మించి ఓట్ల శాతం సాధించిన దాఖలాలు లేవు. పొత్తుల్లో నాలుగైదు సీట్లు సాధించుకోవడం తప్పితే ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే రాష్ట్రంలో పెద్దగా ప్రజాదరణ లేకపోయినా చట్ట సభల్లో పదవులకు మాత్రం బీజేపీ నేతలకు ఢోకా లేదు. శాసనసభలో కేవలం ఎనిమిది మంది శాసనససభ్యులు ఉన్న భారతీయ జనతా పార్టీ టీడీపీ, జనసేనల మద్దతుతో రెండు రాజ్యసభ స్ధానాలను దక్కించుకుంది.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త పంథాను ఎంచుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అంతే కాదు వారికి పదవులను కేటాయించడంలోనూ ముందుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్నేళ్ల నుంచి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే పట్టు బిగించుకోవడానికి, పార్టీ బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అంతే కాకుండా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని బలమైన సంకేతాలను కూడా పార్టీ కేంద్ర నాయకత్వం క్యాడర్ లోకి పంపే ప్రయత్నం చేస్తుంది. సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులను కట్టబెడుతుండటం చర్చనీయాంశమైంది.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణను తీసుకుంటే అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి వచ్చినప్పటికీ ఆమెకు పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించడమే కాకుండా తర్వాత పార్లమెంటు టిక్కెట్ కూడా ఇచ్చారు. అలాగే కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కూడా ఎంపీ సీటు కేటాయించారు. అదే మాదిరిగా టీఆర్ఎస్ లో సుదీర్ఘకాలం ఉండి వచ్చిన ఈటల రాజేందర్ కు కూడా ప్రాధాన్యత ఇస్తూ పార్లమెంటుకు ఎన్నికయ్యేలా చర్యలు తీసుకుంది.

కేంద్ర మంత్రి పదవులు మాత్రం పార్టీని నమ్ముకున్న వారికే ఇచ్చింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తొలి నుంచి బీజేపీలో కిందిస్థాయి నుంచి పనిచేసి వచ్చిన వారికి అవకాశం కల్పించింది. రాజ్యసభ స్థానం కూడా సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసిన లక్ష్మణ్ కు ఇచ్చింది. తమిళనాడులో కూడా అన్నాడీఎంకే నుంచి వచ్చిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పురంద్రీశ్వరికి, కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఇక మంత్రి పదవుల విషయానికి వచ్చే సరికి పార్టీలో కొత్తగా చేరిన వారికి కాకుండా బీజేపీ సిద్ధాంతాలను నమ్మిన వారికి అందలం ఎక్కించారు. రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశారు. అలాగే కేంద్ర మంత్రి పదవి కూడా నరసాపురం నుంచి తొలిసారి ఎన్నికైన భూపతి రాజు శ్రీనివాసవర్మను ఎంపిక చేశారు. ఈ నిర్ణయాలన్నీ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com