ఇంటర్మీడియట్ బోధన, పరీక్షల నిర్వహణపై కీలక సంస్కరణలు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సంస్కరణలకు ఆమోదం తెలిపింది. దీంతో, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. ఇంటర్ విద్యా బోధనలో మార్పులకు సంబంధించి ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కావడంతో.. బోర్డు విద్యా బోధనలో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీలవైపు ఆకర్షించేలా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజిల విద్యార్థులను తయారు చేసేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్లో, విద్యా బోధన తీరులో పలు మార్పులు చేశారు. అంటే.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యా బోధన జూన్ 1వతేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయి. జూన్ 1 వ తేదీకి బదులు ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను 2026 మార్చిలో కాకుండా.. ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు. ఈ మేరకు ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. డిజిలాకర్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా 1973 నుండి 2003 వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటా మొత్తం డిజిటలైజ్ చేస్తారు.
ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందే విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచి, బహుళవిభాగ అభ్యాసాలను ప్రోత్సహించడానికి ఈ విద్యాసంవత్సరం నుంచే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలక్టివ్ సబ్జెక్టులను 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. లాంగ్వేజెస్, సైన్స్, హ్యూమనిటీస్ విభాగాల్లోని 24 ఆప్షన్స్‌లో ఒక సబ్జెక్టును 2వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. జూనియర్ కళాశాలల్లో ఎంబైపిసి ప్రవేశపెట్టాలనే ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఈ విద్యాసంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎంబైపిసి కోర్సు కూడా ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 14 సబ్జెక్టులకు (సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ సహా) సవరించిన సిలబస్‌తో కొత్త పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి.
ఇంటర్మీడియట్లో ఇప్పటివరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఎ, మాథ్స్ బిలను ఇకపై ఒకే సబ్జెక్టుగా విలీనం చేశారు. అలాగే, బైపిసి విద్యార్థులకు బాటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్టు ఉండేలా విలీనం చేశారు. ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజీ లభిస్తుంది. ఈఏపిసెట్, జెఇఇ, నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల కోచింగ్ మెటీరియల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు తయారు చేస్తుంది. ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్‌లో కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్‌ను ఉచితంగా అందజేస్తారు. కాంపిటీటివ్ బేస్డ్ ఎసెస్ మెంట్ కోసం ఇంటర్మీడిటయట్, సైన్స్, హ్యూమనిటీస్ విభాగాల ప్రశ్నల్లో 10శాతం తప్పనిసరిగా బహుళ-ఎంపిక ప్రశ్నలు, ఖాళీలను పూరించే రూపంలో ఒక మార్కు ప్రశ్నలు ఉండేలా క్వశ్చన్ పేపర్ రూపొందించాలని నిర్ణయించారు. స్థాయి ప్రకారం సిలబస్ సవరణ, వృత్తి విద్యార్థుల కోసం డ్యుయల్ సర్టిఫికేషన్‌ను ప్రవేశపెట్టనున్నారు. నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను నిర్ణయించారు. సమగ్ర నిబంధనలను అభివృద్ధి చేయడం, వృత్తిపరమైన సిలబస్‌ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వ జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళికలు రూపొందించారు. వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు.