38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్ల కన్నెర్ర

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ లేనంత వ్యతిరేకత క్యాడర్‌ నుంచి వస్తోందట. తెలుగు తమ్ముళ్లే ఏకంగా చంద్రబాబుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. టీడీపీ సోషల్‌ మీడియా పోస్టులు చూస్తే కూడా ఈ విషయం అర్థమవుతోంది. అంతేకాదు.. చంద్రబాబు మీద కోపాన్ని ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ ముందు వెల్లగక్కుతున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు భారతీయ జనతా పార్టీకి మరీ ఈ స్థాయిలో లొంగిపోవాల్సిన అవసరం ఏముందని పలువురు ముఖ్య కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం సోము వీర్రాజును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే అని అంటున్నారు. సోము వీర్రాజు బీజేపీ సభ్యుడే అయినా.. తెలుగు దేశం పార్టీ మద్దతు లేకపోతే ఆయనకు పదవి ఎలా వస్తుందని అంటున్నారట. బీజేపీకి అవసరమైన సంఖ్యాబలం కూడా లేకున్నా.. బీజేపీ గొంతెమ్మ గోర్కెలకు ఎలా సమ్మతిస్తారని ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. గతంలో టీడీపీపై, టీడీపీ నాయకులపై, కార్యకర్లపై తీవ్ర వ్యతిరేకంగా వ్యవహరించిన సోము వీర్రాజును ఎమ్మెల్సీగా నియమిస్తుంటే చంద్రబాబు ఎందుకు ఊరుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అక్కడ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే.. అమిత్‌ షా దగ్గరే సోము వీర్రాజు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనకు ఒకింత అభ్యంతరం చెప్పినా అదంతా తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, ఇందులో తమకు సహకరించాలని అమిత్ షా కోరినట్లు.. చంద్రబాబు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్య నాయకులు సర్దిచెబుతున్నప్పటికీ పార్టీ కేడర్‌ మాత్రం వినడం లేదంటున్నారు. సోము వీర్రాజును చంద్రబాబు వ్యతిరేకిగానే తాము భావిస్తామని తెగేసి చెబుతున్నారు. సోము వీర్రాజు పదవి నుంచి తొలగి పోయిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో కూటమి పొత్తు ఏర్పడిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజధాని అమరావతికి కూడా గతంలో వ్యతిరేకంగానే సోము వీర్రాజు పావులు కదిపారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో చలో అమరావతికి పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చినప్పటికీ.. సోము వీర్రాజు కేంద్ర నాయకత్వంతో చెప్పి దానిని సమర్థంగా అడ్డుకోగలిగారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పైగా చంద్రబాబు కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కాలేదంటూ గతంలో సోము వీర్రాజు చేసిన కామెంట్స్ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాంటి సోము వీర్రాజుకు సహకరించాల్సిన అవసరం ఏముందని టీడీపీ కార్యకర్తలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల పార్టీ కార్యకర్తల్లోనే కాదు.. ఓటు బ్యాంకుగా ఉన్న పార్టీ అభిమానులుగా ఉన్న జనంలో కూడా కొంత అసంతృప్తి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకెంత మందికి అవకాశాలు ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి మన అవసరం ఎంత ఉందో తెలియంది కాదని, అలాగే, మనకూ కేంద్ర ప్రభుత్వం అవసరం ఉందని, అంత మాత్రాన పూర్తిగా లొంగిపోవడం ఎందుకని తెలుగుతమ్ముళ్లు హై కమాండ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సోము వీర్రాజు వచ్చినట్లే.. రేపు జీవీఎల్ వస్తారని, ఎల్లుండి విష్ణువర్థన్ రెడ్డి రారన్న గ్యారంటీ ఏముందని చంద్రబాబును క్యాడర్ నిలదీస్తుండటంతో నేతల నుంచి అధినాయకత్వం వరకూ తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు. కేవలం నిధుల కోసం కేంద్రం వద్ద చేతులు కట్టుకుని కూర్చుకునే కంటే అభ్యంతరం చెప్పి మరొకరికి అవకాశం ఇప్పించి ఉంటే బాగుండేదని సూచిస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు బీజేపీ చేతిలో బందీగా తయారయ్యారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కరంగా మారిందనే చెప్పాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com