ఏపీలో కూటమి ప్రభుత్వం ఫుల్ జోష్‌లో ఉంది. అమరావతి రాజధాని నగరం నిర్మాణానికి శర వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ దఫా అధికార కాలపరిమితి లోగానే అమరావతి నిర్మాణం దాదాపు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికోసం మంత్రి నారాయణ పూర్థిస్థాయిలో దృష్టి పెట్టారు. అంతేకాదు.. కేబినెట్ సబ్ కమిటీని నియమించింది ప్రభుత్వం. అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించేలా కేబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు సీఆర్‌డీఏకు అవసరమైన సూచనలు చేస్తోంది. అటు..కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి సాయం ప్రకటించింది. రాజధానిలో కీలకమైన రవాణా, రైల్వే ప్రాజెక్టులను కూడా కేంద్రం మంజూరు చేసింది. ఇక, అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా రూపొందించాలని చంద్రబాబు ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారు. 2028లోగానే అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
ఇక, అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సూచికగా, పనులు అంతరాయం లేకుండా, అవాంతరాలు కలగకుండా పూర్తయ్యేందుకు శ్రీనివాసుడి అనుగ్రహం కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఈనెల 15వ తేదీ శనివారం అమరావతితలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తున్నారు. దీనికోసం టీటీడీ అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తోంది. వెంకటపాలెంలో ఉన్న శ్నివాసుడి ఆలయంలో ఈ కల్యాణోత్సవం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ వేడుకలకు హాజరు కానున్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటపాలెంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పట్టించుకోలేదు.. కానీ, ఈ ఆలయ నిర్మాణం మాత్రం పూర్తి చేసింది. 2022లో ఈ ఆలయాన్ని వైభవంగా ప్రారంభించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా కన్నుల పండువగా నిర్వహించారు. ఇక, అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. శ్రీనివాస కళ్యాణంపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో టీటీడీ ప్రచార రథంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో.. ఆలయ ప్రాంగణంలో గ్యాలరీలు, క్యూ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించి మార్క్ చేశారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా వాహనాలను ఎక్కడ నిలపాలనే విషయాన్ని భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. మొత్తానికి అమరావతిలో భారీ ఈవెంట్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం ప్లాన్ చేసింది.