ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ఇంట్లో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడి తీవ్ర వివాదం కొనసాగుతున్న వేళ ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. దీనిపై అతి త్వరలో కేంద్రం ఆమోద ముద్ర వేయనుంది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదలీ కానున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొలీజియం ఈ నెల 20, ఈరోజున భేటీ అయ్యి చర్చించి ఈ నిర్ణయానికి వచ్చింది.
జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై అక్కడి బార్ ఇప్పటికే వ్యతిరేకించింది. అలహాబాద్ హైకోర్టు ఏం చెత్త డబ్బా కాదని.. అతడిని తొలగించే విషయంపై నిర్ణయం తీసుకోవాలంది. దీంతో వర్మ బదిలీకి.. ఆయనపై ఉన్న వివాదానికి సంబంధం లేదని అప్పుడు ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ నోట్ల కట్టలు లభించాయి. దీనిపై తీవ్ర దుమారం రేగింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనపై కుట్ర జరుగుతుందన్నారు ఆయన. మరోవైపు ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ హైకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు కొలీజియం నిర్ణయం అతడిని బదిలీ చేయాలని సిఫారసు చేసింది. ఇప్పటికే ముగ్గురు సభ్యుల కమిటీ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది.