ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి డీఎస్సీని పక్కా ప్రణాళికతో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి దరఖాస్తులను రెండు విభాగాలుగా స్వీకరించబోతున్నారని తెలుస్తోంది. డీఎస్సీకి అప్లై చేయాలనుకునే వాళ్లు కచ్చితంగా కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. అన్ని సర్టిఫికెట్లు స్కాన్ చేసి పెట్టుకోవాలి. దరఖాస్తు టైంలోనే వాటిని అప్‌లోడ్ చేయాలి. సాధారణంగా డీఎస్సీలో విజయం సాధించిన తర్వాత పోస్టింగ్ తీసుకునే టైంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, పాఠశాల ఎంపికను పూర్తి చేస్తారు.
కానీ ఈసారి ముందుగానే పాఠశాల ఎంపికకు అవకాశం ఇస్తున్నారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే టైంలోనే ప్రభుత్వం, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శపాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖ నిర్వహించే పాఠశాల్లో దేనిలో ఆసక్తి చూపిస్తారో చెప్పాల్సి ఉంటుంది. ప్రాధాన్యతకు అనుగుణంగా… డీఎస్సీలో ఎంపికైన తర్వాత పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మార్చుకోవడానికి వీలు ఉండదు. దీన్ని డీఎస్సీ అప్లికేషన్ పార్ట్ ఏలో పెడుతున్నారు. ఇక పార్ట్ బీలో అభ్యర్థి వివరాలు నమోదు చేసి సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏడో తరగతి నుంచి బీఈడీ వరకు అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. దీంతోపాటు కుల, పీహెచ్, ధ్రువీకరించే సర్టిఫికెట్లను కూడా సిద్ధం చేసుకోవాలి. అందుకే ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం ఉత్తమం అని అధికారులు చెబుతున్నారు.
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ ఆఫీసులు కిక్కిరిసిపోతాయని అంటున్నారు. ముందుగానే అప్లై చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మొదటి నుంచి చెబుతున్నట్టుగానే 16,347 ఉద్యోగాలతో నార్మల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ మధ్య ప్రకటించిన 2,260 ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను తర్వాత భర్తీ చేస్తారు. ఈ రెండింటిని కలపడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రిపేర్ అయ్యేందుకు స్పెషల్ బీఈడీ విద్యార్థులకు సమయం ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయనుంది. టెట్ పెట్టి చాలా కాలం అవుతున్నందున రెండూ కలిపి నిర్వహించాలని డిమాండ్ అభ్యర్థుల నుంచి వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం డీఎస్సీ మాత్రమే నిర్వహించాలని చూస్తోంది. ఇప్పటికే ఆలస్యమైనందున రెండింటినీ కలిపే ఆలోచన లేనట్టుగానే చెబుతోంది.