ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ విశాఖపట్నం నుంచి నడుస్తున్న విమాన సర్వీసులపై అంతృప్తి గళం వినిపించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు నినాదాన్ని ఇప్పుడు కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ కూడా అందుకుంది. భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు సైతం గంటా శ్రీనివాస్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. విశాఖపట్నం నుంచి ఉదయం పూట విజయవాడకు వెళ్ళాలంటే విమాన కనెక్టివిటీ లేదని విష్ణుకుమార్ రాజు కూడా అంటున్నారు. విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం వల్ల పార్టీ సమావేశాలు, ప్రభుత్వ అవసరాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను డైరెక్ట్ గా అడగలేకపోతున్నప్పటికీ విశాఖలో వ్యాపార వర్గాలతో సహా అందరూ విశాఖపట్నాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందనే అభిప్రాయంతో ఉన్నారని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా విశాఖపట్నానికి ఈ దుస్థితి ఎందుకో అర్థం కావడం లేదని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ గంటా చేసిన ట్వీట్ కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయ్యిందంటూ కూటమి పెద్దలు గంటాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అంటూ ఆవేదనతో గంటా శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. అంటూ గంటా శ్రీనివాస్ తన ట్వీట్ లో అసహనం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
విశాఖపట్నం, విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి అంటూ గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. అయితే గంటా శ్రీనివాసరావు ట్వీట్ కాస్తా వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ప్రభుత్వం మనదే, విమానయాన మంత్రి మనవారే.. వారి దృష్టికి నేరుగా తీసుకురావొచ్చు కదా? అని గంటాను టీడీపీ అధిష్టానం మందలించినట్లు సమాచారం. మరోసారి ఇలాంటివి రిపీట్ కావొద్దు అంటూ హెచ్చరించింది. అయితే తాజాగా కూటమి భాగస్వామ్య పార్టీల్లో ఒకరైన బీజేపీ శాసనసభ్యుడు, శాసనసభా పక్ష నేత కూడా అయిన విష్ణుకుమార్ రాజు ఇదే అంశంపై టీడీపీ శాసనసభ్యుడు గంట శ్రీనివాసరావుకు వంత పాడటంతో విశాఖ విమాన సర్వీసుల వ్యవహారంపై చర్చ కొనసాగుతోంది.