ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల వేళ ఇంటింటికీ వెళ్లారు. అది కూడా శాంతాక్లాజ్ వేషంలో. వెళ్తూ వెళ్తూ తను వెళ్లిన ప్రతి ఇంట్లో బహుమతులు పంచి పెట్టారు. ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లుగా ఆ బహుమతులను రూపొందించారు. అయితే ఇదంతా నిజం వీడియో కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించుకొని ఆమ్ ఆద్మీపార్టీ సోషల్ మీడియా వింగ్ రూపొందించిన వీడియో ఇది. ఈ వీడియోను ఆప్ సోషల్ మీడియా వింగ్ ఇంటర్నెట్‌లో వైరల్ చేసింది.
సహజంగానే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆమ్ ఆద్మీపార్టీ ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే, ఓ వినూత్న వీడియోను షేర్ చేసింది. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు బహుమతుల రూపంలో పలు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లుగా ఆ వీడియోను రూపొందించారు. ఢిల్లీ ప్రజలకు వారి సొంత శాంతా ఏడాది పొడవునా బహుమతులు ఇస్తూనే ఉన్నారని ఆప్ ఈ వీడియోకు వ్యాఖ్యను జత చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం అక్కడి ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను రూపొందించింది. ప్రస్తుతం ఉచిత కరెంటు, విద్య, వైద్యం సహా ఇతర పథకాలను లబ్దిదారులు పొందుతున్నారు. తాము మరోసారి అధికారంలోకి వచ్చాక మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల పేర్కొన్నారు.