సినీ ప్రముఖులతో సమావేశం అవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకున్నారు. కొద్ది సేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమయ్యింది. ప్రధానంగా ప్రభుత్వం, సినీ పరిశ్రమల మధ్య సత్ససంబంధాలు పునరుద్దరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వం తరపున కొన్ని విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు స్పష్టం చేయనున్నట్లు సమచారం. అందులో ముఖ్యమైనది రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం సినీ పరిశ్రమకు చెందిన వారు పూర్తి స్ధాయి సహకారం అందించాలని, ప్రతి సెలబ్రిటీ ఎన్టీ డ్రగ్స్ క్యాంపైన్ కోసం లఘు చిత్రాలు చేయాలని ప్రభుత్వం తరపున డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లలో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలని, కుల గణన సర్వే ప్రచార కార్యక్రమాల్లో సినీ నటులు పాల్గొనాలని ప్రభుత్వం సినీ పరిశ్రమను డిమాండ్ చేయనుందని సమాచారం. అదేవిధంగా సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ విధించే విధంగా నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రకటించనుందని తెలిసింది. ఈ సంక్రాంతికి విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలకు టిక్కెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు తదితర అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో కూడా ఒక ప్రకటన చేసింది. దీంతో బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి ఎంత వరకూ వెనక్కి తగ్గుతుందనే అంశం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ప్రతియేటా సినిమాలకు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సినీ పరిశ్రమ నుంచి విముఖత వ్యక్తమయ్యింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సమావేశంలో సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజులో పాటు హీరోలు అక్కినేని నాగార్జున, వెంకటేష్, సాయి దుర్గాతేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్, రామ్ పోతినేని, నితిన్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్దు, అడవి శేషులతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు.