ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను కేసీఆర్ దివాళా తీయించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ.8 లక్షల అప్పుల రాష్ట్రంగా బీఆర్ఎస్ మార్చేసిందని మండిపడ్డారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ వంటి యోధులు పాలించిన గడ్డ ఓరుగల్లు అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ వరంగల్ జిల్లా అని కొనియాడారు. వరంగల్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రూ.800 కోట్లతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణామాఫీలు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కారణం అయిన నియామకాలు చేపట్టి పూర్తి చేస్తున్నామని, ఒక్క ఏడాదిలోనే 55 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం సరిపోవడం లేదని, అయినా ప్రజలకు సంక్షేమ పథకాలకు ఒక్క రూపాయి కూడా ఆపడం లేదన్నారు. కడియం శ్రీహరి నిజమైన నాయకుడు అని, తనకోసం ఎలాంటి పైరవీలు చేయరని.. ప్రజలకోసం పథకాలు ఇవ్వమని, వాటికి నిధులు ఇవ్వండి అని మాత్రమే అడుగుతారని అన్నారు.
కడియం కావ్యను ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపితే.. కేంద్రంతో కొట్లాడి వరంగల్‌కు ఎయిర్‌పోర్టును, కాజీపేటకు రైల్వే డివిజన్‌ను తీసుకు వచ్చిందన్నారు. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారని.. కనీసం మూడేళ్లు కూడా ఆ ప్రాజెక్టు ఆగలేదని మండిపడ్డారు. అది కాళేశ్వరం కాదని.. కూలేశ్వరం అని మండి పడ్డారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎన్నో.. బీఆర్ఎస్ కట్టినవి ఎన్నో తేల్చుకుందామని.. దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.