జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గాంలో జరిగిన ఉగ్రదాడిలో ముష్కరులకు స్థానిక కశ్మీరీలు కొందరు సహకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పహల్‌గాం బైరసన్ లోయలో జరిగిన ముష్కర కాండలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సైనికుల మాదిరిగా పర్యాటకుల దగ్గరికి వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏంటని అడుగుతూ అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ప్రభు్తవం విచారణకు ఆదేశించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి ఉగ్రదాడి జరిగినప్పటినుంచీ ఆ ప్రాంతంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యింది.
అయితే, ఎన్‌ఐఏ దర్యాప్తులో పలు కీలక అంశాలు, ఆధారాలు బయట పడుతున్నాయి. ఉగ్రవాద దాడి జరిగిన సమయంలో టెర్రరిస్టులతో పాటు.. పది మందికి పైగా కశ్మీరీ ఓవర్ గ్రౌండ్ వర్కర్‌లు కూడా వాళ్ల వెంట ఉన్నట్లు ఎన్‌ఐఏ నిర్థారణకు వచ్చింది. వీళ్లంతా దాడి జరిగిన సమయంలో ప్రత్యక్షంగా ముష్కరులకు సహకరించినట్లు చెబుతున్నారు.
వీళ్లంతా.. ఉగ్రవాదులతో చాటింగ్ చేయడానికి, వాళ్లతో సమన్వయం చేసుకోవడానికి, అలాగే.. ఎన్‌క్రిప్టెడ్ మెస్సేజింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించి.. ఉగ్రవాదులతో రియల్ టైమ్ కమ్యూనికేషన్‌ను కొనసాగించినట్లు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరగ్గా.. ఆ మరుసటి రోజు అంటే.. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఎన్‌ఐఏ బృందాలు ఆధారాల అన్వేషణలో మునిగిపోయాయి. జాతీయ దర్యాప్తు సంస్థ.. యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఉగ్ర దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులను ఇప్పటికే ప్రశ్నించాయి. అలాగే, ఉగ్రవాదుల కార్యనిర్వహణ విధానాల ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ బృందాలు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ భయంకరమైన ఉగ్రదాడి వెనుక ఉన్న కుట్రను వెలికి తీసేందుకు ఆధారాల కోసం ఫోరెన్సిక్, ఇతర నిపుణులు మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే, పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం అనేక శోధన కార్యకలాపాలను ప్రారంభించి, అప్రమత్తంగా ఉంది.