తెలంగాణలో పాఠశాల విద్యాశాఖలో విద్యా బోధన, పరీక్షల విధానంలో వచ్చే యేడాది నుంచి పలు కీలక మార్పులు అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ సారి అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే.. 2025-26లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు పరీక్షల నిర్వహణ విధానం పూర్తిగా మారిపోనుంది. ప్రభుత్వం అనుకుంటున్న మార్పులతో కూడిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ అధికారులు రూపొందించారు. దానిని ప్రభుత్వ పెద్దల ఆమోదం కోసం పంపించారు.
ఈ క్యాలెండర్‌లో చేసిన మార్పుల ప్రకారం చూస్తే.. ప్రతి యేటా సమ్మేటివ్ అసెస్‌మెంట్ ఎస్‌ఎ-1 పరీక్ష దసరా సెలవుల కంటే ముందుగా నిర్వహిస్తారు. కానీ, వచ్చే యేడాది దసరా సెలవులు పూర్తయ్యాక ఎస్‌ఏ-1 పరీక్ష నిర్వహిస్తారు. ఈ సంవత్సరం దసరీ పండుగ ముందుగా వస్తున్నందున పండుగ సెలవుల తర్వాత పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ చివరి వారంలో సమ్మేటివ్ అసెస్‌మెంట్ -1 పరీక్షలు జరుగుతాయి.
ఇక, ప్రతియేటా ఫార్మేటివ్ అసెస్‌మెంట్ – ఎఫ్‌ఎ పరీక్షలు నాలుగు దశలుగా జరుగుతాయి. అయితే, వచ్చే విద్యా సంవత్సరం నుంచీ రెండు మాత్రమే నిర్వహించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో, ఎఫ్‌ఏ పరీక్షలకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రతియేటా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ముందు జయశంకర్ బడిబాట పేరుతో.. జూన్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ముందుగానే ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా.. ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఉపాధ్యాయులు ఇప్పటికే అనధికారికంగా బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు.
ఇక, మార్పులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వస్తే తప్ప అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.