23.4 C
Hyderabad
Monday, June 29, 2026

Live Video

spot_img

పవన్‌ కల్యాణ్‌ తీరుపై కాపుల్లో అసంతృప్తి

పవన్‌ కల్యాణ్‌. జనసేన అధినేత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న నాయకుడు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన నేత. ఇవన్నీ సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే. కానీ, ఏపీలో ఓ వర్గం వాళ్లు.. తమ నేతగా, తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడిగా మొదటినుంచీ ఆశలు పెట్టుకున్నారు. వాళ్లే కాపు సామాజిక వర్గం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ కులాల చుట్టూ, సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ఏపీలో పోటీ చేస్తున్నారన్నప్పటినుంచే ఆయన సామాజిక వర్గం కాపులకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని సామాన్యుల దాకా పవన్‌ కల్యాణ్‌కు జై కొట్టారు. తమ ప్రతినిధి ఏపీలో కీలక రోల్‌ పోషించబోతున్నారని సంబరాలు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు గడిచింది. అయినా తమ దిశగా, తమ కోణంలో ఒరగబెట్టిందేమీ లేదన్న భావనలో ఏపీకి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఉన్నారంటున్నారు.

ఇక, ఇటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖల బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొన్నాళ్లు తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమీక్షలు, నిర్ణయాలు, వ్యూహాలపై దూకుడుగా వ్యవహరించినప్పటికీ కొంతకాలంగా సైలెంట్‌ అయిపోయారు. ఇటీవలి కాలంగా ఏ అంశాన్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య కాలంలో కేవలం లడ్డూ వివాదంపై తలదూర్చడం మినహా మిగిలిన రాష్ట్ర రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. అలాగే నిధుల కోసం ఢిల్లీకి పరుగులు తీయడం, కేంద్ర మంత్రులను కలవడం వంటి వాటికి కూడా పవన్‌ కల్యాణ్ దూరంగా ఉంటున్నారు. కేవలం తన కార్యాలయం, పార్టీ ఆఫీసు వరకే పవన్ కల్యాణ్ పరిమితమవుతున్నారు.

అయితే, పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం వ్యవహరిస్తున్న శైలి జనసేన క్యాడర్‌కు, జనసేన పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించిన కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి కనిపిస్తోందంటున్నారు. అంతేకాదు.. ఆ వర్గానికి చెందిన కొందరిలో అసహనం కూడా మొదలైందంటున్నారు. పవన్‌ కల్యాణ్‌తో సన్నిహితంగా ఉండేవాళ్లు, ఆయన వద్దకు వెళ్తున్న కొందరికి మాత్రమే వ్యక్తిగతంగా ప్రయోజనం, లబ్ది కలుగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి కాపు సామాజిక వర్గం గురించి పవన్‌ కల్యాణ్‌ అసలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఏకపక్షంగా నిలిచి జనసేన పార్టీకి తిరుగులేని విజయం సాధించేలా చేసిన కాపు సామాజిక వర్గానికి సంబంధించి కీలక ప్రయోజనాలు చేకూరుస్తారని పవన్‌ కల్యాణ్‌పై ఎంతగానో ఆశలు పెట్టుకున్నారంటున్నారు. ప్రధానంగా తమ గురించి, తమ సామాజిక వర్గం ప్రయోజనం గురించి పవన్‌ కల్యాణ్‌ పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి.. ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా కనిపిస్తోందంటున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. ఆ జిల్లాల్లో విజయానికి కాపు సామాజిక వర్గం అండదండలే కారణమన్న వాదనలున్నాయి. కానీ, ఆ జిల్లాలపై కూడా ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టింది లేదంటున్నారు. అంతేకాదు.. ఆ జిల్లాల్లో ఇప్పటికీ పవన్‌ కల్యాణ్‌ పెద్దగా పర్యటించలేదు. మంత్రి వర్గ సమావేశాల్లోనూ తమ కమ్యునిటీ ప్రయోజనాల గురించి ప్రస్తావించిన సందర్భం లేకపోవడం వారిని ఒకరకంగా ఇబ్బంది పెడుతోందంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com