24.1 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

కాంతార 2కు చిక్కులు…వరుస ప్రమాదాలు

కాంతార 2 సినిమాకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. కన్నడ నటుడు రిషబ్ శెట్టి నిర్మిస్తున్న కాంతారా – 2 చిత్ర నిర్మాణానికి అణువుఅనువునా అవాంతరాలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ కర్ణాటకలోని గవి గుడ్డ, హేరూరు అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్ కారణంగా అటవీ ప్రాంతం దెబ్బతింటోందని స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో షూట్ చేసుకోవడానికి అధికారులు అనుమతి  ఇవ్వగా… చిత్రబృందం అక్రమంగా అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు వాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేలుడు పదార్థాల వినియోగంతో మూగ జీవాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై చిత్ర బృందానికి, స్థానికులకు మధ్య కొద్దిరోజులుగా వివాదం సాగుతోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్రబృందం దాడి చేసిందని పేర్కొంటూ స్థానికులంతా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పోలీసులు దీనిపై త్వరితగతిన స్పందించి, చర్యలు తీసుకోకపోతే తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు కొన్ని రోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత గాలి వానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ పూర్తిగా ధ్వంసం అయింది. తాజాగా సినిమా షూటింగ్‌లో జూనియ‌ర్ ఆర్టిస్ట్ క‌న్నుమూయడం సంచలనం సృష్టించింది. కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్(33) ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్ లోని కొల్లూరులో ఈ ఘటన జరిగింది.

షూటింగ్ ముగిసిన త‌ర్వాత కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు అంచ‌నా వేయ‌లేక న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన‌ట్టు తెలుస్తుంది. కొల్లూరు పోలీస్ స్టేష‌న్ పరిధిలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాంతార సినిమాకు ప్రశంసలు అందుకున్న రిషాబ్ శిట్టి…కాంతారా 2 సినిమా నిర్మాణంలో స్థానికులను ఇబ్బంది పెడుతున్నందుకే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com