అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.
కపిల్ సిబల్ నేతృత్వంలోని ఎంపీల బృందం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు ఈ తీర్మానాన్ని సమర్పించింది. ఈ తీర్మానంపై 55 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. దీంతో, దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ మొదలయ్యింది.
వీహెచ్‌పీ సభలో జస్టిస్ శేఖర్ యాదవ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపైనే ఎంపీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఉన్నతమైన జడ్జి హోదాలో ఉన్న జస్టిస్ శేఖర్ యాదవ్ ప్రసంగం మత విద్వేషాలు సృష్టించే ప్రమాదం ఉందని, రాజ్యాంగంలోని లౌకిక ధర్మాన్ని ఉల్లంఘిస్తోందని ఎంపీలు ఆక్షేపించారు.
జడ్జిపై అభిశంసన, వేటు తప్పదా?
ఈ పరిణామాల నేపథ్యంలో జడ్జి శేఖర్ యాదవ్‌పై వేటు తప్పదా? అన్న చర్చ మొదలయ్యింది. ప్రజాస్వామ్యంలోని మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన వాళ్లు న్యాయమూర్తులు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఆలోచనలు ఎలాంటివి ఉన్నా.. బహిరంగంగా గానీ, విధి నిర్వహణలో గానీ రాగద్వేషాలకు అతీతంగా న్యాయమూర్తులు వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, కొంతకాలంగా న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ చేరారు.
జస్టిస్ శేఖర్ యాదవ్ ఏమన్నారంటే?
ఈ అభిశంసన తీర్మానానికి దారితీసిన పరిస్థితులు చూస్తే.. విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో న్యాయమూర్తి శేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనెల 8వ తేదీన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్‌లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో న్యాయమూర్తి శేఖర్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఆయన మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలని వ్యాఖ్యనించారు. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని ఆయన అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఆయన వీహెచ్‌పీ కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
విపక్షాల కన్నెర్ర :
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్.. బహిరంగంగా ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన ప్రసంగం మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉందని మండిపడ్డాయి. ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించేందుకు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం పెడతామని ప్రకటించాయి. ప్రకటించిన మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు 55 మంది ఎంపీలు సంతకాలు చేసి అభిశంసన తీర్మానాన్ని సమర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేశారు. సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా తదితరులు బలపరిచారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
అత్యున్నత న్యాయస్థానం జోక్యం :
మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది. జస్టిస్ శేఖర్ యాదవ్ వీహెచ్‌పీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ అడిగింది.
జడ్జిని పదవినుంచి తొలగించే ప్రక్రియ ఇదీ…
ఏదైనా హైకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించడం అంత సులువైన విషయం కాదు. దీని వెనుక చాలా పెద్ద తతంగం ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లలో ఈ అంశం గురించిన ప్రస్తావన ఉంది. ఎవరైనా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వస్తే.. ఆ డిమాండ్‌మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలంటే.. 100 మంది లోక్‌సభ సభ్యులు గానీ, లేదంటే 50 మంది రాజ్యసభ ఎంపీలు గానీ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌కు అందజేయాలి. ఇప్పుడు జస్టిస్ శేఖర్ యాదవ్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై 55 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేశారు. కాబట్టి ఈ తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
అయితే, పార్లమెంటులో ఈ తీర్మానంపై చర్చకు పెట్టే ముందు కూడా చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరిస్తే లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు.
ఇక, పార్లమెంట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరిగా అవసరం. పార్లమెంట్ ఉభయ సభలు ఈ తీర్మానాన్ని గనక ఆమోదిస్తే.. ఆ తీర్మానాన్ని అదే సెషన్‌లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే అంశంపై ప్రకటన చేస్తారు. రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకే ఈస్థాయిలో ఇంతటి సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించాల్సి వచ్చిందనేలా ఈ వ్యవహారం మొత్తం సాగుతుంది.
కాగా, ప్రస్తుత వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉండటమే కారణమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
గతంలోనూ న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు :
హైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన అనుభవాలు ఉన్నాయి.
– 1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.
– 2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు.
– 2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.
– 2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది.
– 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు.