38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఈ యేడాది జీసీసీల్లో ఉద్యోగాల జాతర

నేటి టెక్నాలజీ యుగంలో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు దేశంలో ఉద్యోగాల కల్పనలో దూసుకుపోతున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌ వంటి నగరాలకు ప్రయోజనం కలుగుతోంది. ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2025 యేడాది ఏకంగా 3.64 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. ప్రతియేటా 15శాతం ప్రోగ్రెస్‌తో జీసీసీ సెంటర్లు ఆశలు కల్పిస్తున్నాయి. గడిచిన ఏడాది 2024లో ప్రపంచవ్యాప్తంగా వారానికో జీసీసీ ఏర్పాటయినట్లు ఇండక్టస్‌ అనే సంస్థ తన యాన్యువల్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ ఉద్యోగాల కల్పనలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలు కీలకంగా మారనున్నాయని తెలిపింది. ప్రపంచంలోని సగానికిపైగా జీసీసీలు అంటే.. దాదాపు 1800 జీసీసీలు మన దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో 60 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్‌లోని జీసీసీల మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని కూడా అంచనా వేసింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జీసీసీలు ఇకపై మామూలు నగరాలపైనా దృష్టిసారించాయని, ఇవన్నీ కూడా నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ స్థానిక నిపుణులకు అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయని ఇండక్టస్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

వాస్తవానికి జీసీసీలు కొద్దికాలంగా భారీగా విస్తరిస్తున్నాయి. టెక్నాలజీ ఎంతగా పెరిగినప్పటికీ ఆ సాంకేతికతను నిర్వహించేందుకు మానవ వనరులు అవసరం. అందుకే ఉద్యోగాల కల్పన అనివార్యమవుతోంది. అయితే, నిపుణులైన మ్యాన్‌పవర్‌ కొరత తీవ్రంగా వేధిస్తోందని దాదాపు 50 శాతం జీసీసీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతియేడూ 15లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, నిపుణుల కొరత మాత్రం ఎక్కువగానే ఉందంటున్నారు. ఈ పరిణామం ఐటీ ఇండస్ట్రీ అవసరాలకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్న అంతరాన్ని సూచిస్తోందని నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితిని అధిగమించేలా ఐటీ సంస్థలు చొరవ తీసుకోవాలని సూచించింది. పాఠ్యప్రణాళిక తయారీలో విద్యా విభాగాలతో భాగస్వామ్యం కావడం దగ్గరనుంచి, విద్యార్థులకు ఆన్‌జాబ్‌ ట్రైనింగ్, సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా నిర్వహించేలా ఐటీ కంపెనీలు చొరవ తీసుకోవాల్సి ఉందని ఆ నివేదిక సలహా ఇచ్చింది. విద్యా సంస్థలు జీసీసీల్లో ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు చేపట్టాలన్న నిబంధన తప్పనిసరి చేయాలని పేర్కొంది.

ఇండక్టస్‌ రిపోర్ట్‌ ప్రభుత్వాలకు కూడా పలు సూచనలు చేసింది. ప్రభుత్వాలు జీసీసీల అభివృద్ధికి వీలుగా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, భవిష్యత్‌ సాంకేతికతలైన ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, ఇతర నూతన ఆవిష్కరణలకు వీలుగా ప్రభుత్వ విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సలహా ఇచ్చింది. అలాగే, మెట్రో నగరాల తర్వాత మిగతా నగరాల్లో కూడా జీసీసీలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. ఇక, విద్యాసంస్థలు కూడా జీసీసీల అవసరాలను అందిపుచ్చుకొని.. ఆ అవసరం మేరకు విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఇండక్టస్‌ నివేదిక సూచించింది. అలాగే, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు ఆసక్తి చూపించేలా ఆయా కంపెనీలు.. కార్పొరేట్‌ డిజైన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని సూచించింది.

ప్రధానంగా ఐటీ ఇండస్ట్రీలో మనదేశంలోని మానవ వనరులు ఎంతగానో దోహదపడుతున్నాయి. ప్రపంచస్థాయి ఐటీ సంస్థలకు హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై, ముంబయి, నోయిడా లాంటి ప్రధాన నగరాలు అనుకూలంగా మారడంతో.. జీసీసీలు ఏర్పాటు చేస్తూ.. ఆయా కంపెనీలు 40-70 శాతం దాకా ఖర్చులను తగ్గించుకుంటున్నాయని, అభివృద్ధి చెందిన దేశాల్లోని అంతర్జాతీయ టెక్‌ హబ్‌ల కన్నా జైపుర్, హైదరాబాద్, పుణెలలో స్థిరాస్తి, వినియోగ వ్యయం తక్కువగా ఉందని ఈ నివేదిక తేల్చింది. తెలంగాణ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు జీసీసీలకు స్నేహపూర్వక విధానాలు అమలు చేస్తున్నాయని ప్రస్తావించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి సంస్థలు దేశంలో కార్యకలాపాలు వేగవంతం చేశాయని, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ జీసీసీ విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఇండక్టస్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

ఇక, జీసీసీల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునేవాళ్లకు అధిక డిమాండ్‌తో పాటు.. ప్రపంచస్థాయి సంస్థలు అత్యధిక జీతాలు కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీలో స్టార్టింగ్‌ శాలరీ సగటున ఏడాదికి రూ.9.57 లక్షలుగా ఉంది. క్యాంపస్‌ నియామకాల్లోనూ ఏఐ, డేటా సైన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ రంగాల్లోని పట్టభద్రులకు సాధారణ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30 శాతం ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న జీసీసీలు డిజిటల్‌ టెక్నాలజీలైన ఏఐ, మెషీన్‌ లెర్నింగ్, డేటా అనలిటిక్స్‌ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దేశంలోని జీసీసీల్లో అత్యధికంగా అమెరికాకు చెందినవి 1,250 ఉన్నాయి. 2030 నాటికి జీసీసీ కార్యకలాపాల్లో ఏఐ-ఎంఎల్‌ ఆటోమేషన్‌ దాదాపు 75 శాతం వాటాను ఆక్రమిస్తుందని అంచనా వేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com