31.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

ప్రభుత్వ సలహాదారుగా జానారెడ్డి?

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జానారెడ్డికి ప్రభుత్వంలో కీలక పదవి రిజర్వ్‌ అయ్యిందా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావడం దేనికి నిదర్శనం? ఇప్పుడున్న పరిస్థితుల్లో జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారా? గాంధీ భవన్‌ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
కేబినెట్‌లోని కొందరు తన మాట వినడం లేదని, కొందరు సహకరించడం లేదని రేవంత్‌ రెడ్డి బహిరంగంగానే కామెంట్‌ చేసిన నేపథ్యంలో ప్రభుత్వంలో పార్టీకి చెందిన ఓ పెద్ద దిక్కు కోసం సీఎం ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకుడైన జానారెడ్డిని వ్యూహాత్మకంగా రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

అటు.. రేవంత్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు.. కీలక పదవుల గురించి అధిష్టానంతో చర్చించబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉన్నట్టుండి జానారెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లడం రాజకీయంగా పెద్ద చర్చను లేవనెత్తింది. జానారెడ్డితో ఆంతరంగికంగా రేవంత్ చర్చించారని, తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడిపించే తీరుపై మంతనాలు సాగించినట్లు సమాచారం. ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా జానారెడ్డిని నియమించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారని.. దీని గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందంటున్నారు.

మరోవైపు.. ప్రభుత్వంలో జానారెడ్డిని కీలక భాగం చేయడం వెనక రేవంత్ రెడ్డి వ్యూహం సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు నిలుపుకోవాలంటే.. అటు అధిష్టానం అంగీకరించేలా, ఇటు ప్రభుత్వంలో తోటి కేబినెట్‌ సహచరులు ఒప్పుకునేలా ఉండాలని, అందుకే జానారెడ్డిని ఎంచుకున్నారని చెబుతున్నారు. నిజానికి పార్టీలో మిగతా సీనియర్లతో పలు సందర్భాల్లో రేవంత్‌కు గ్యాప్‌ ఏర్పడ్డా .. జానారెడ్డితో మాత్రం మొదటి నుంచి బంధం బలంగానే ఉంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ నియామకంలోనూ జానారెడ్డి పాత్ర కీలకం అనే ప్రచారం కూడా జరిగింది. రేవంత్‌కు పదవి ఇప్పించేందుకు అధిష్టానంతో జానారెడ్డి స్వయంగా మాట్లాడారనే టాక్‌ కూడా అప్పట్లో వినిపించింది.

అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో జానారెడ్డి సపోర్ట్‌ తనకు చాలా అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే ఆయనను ప్రభుత్వంలో చేర్చి.. తన బలం పెంచుకోవాలన్నది రేవంత్ వ్యూహమనే చర్చ జరుగుతోంది. అందుకే ముందుగా ప్లాన్‌ లేని విధంగా ఒక్కసారిగా జానారెడ్డి ఇంటికెళ్లారు రేవంత్‌ రెడ్డి.

ఇక, జానారెడ్డికి ప్రభుత్వంలో కీలక పదవి అప్పగిస్తే.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నిబంధనల సంగతి ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒక కుటుంబానికి ఒకే పదవి అనే నిబంధన పెట్టుకున్నారు. అయిఏత, ఇప్పుడు జానారెడ్డికి ప్రభుత్వంలో పదవి అప్పగిస్తే.. ఆయన కుటుంబంలో ముగ్గురికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే ఆయన కుమారుల్లో ఒకరు ఎమ్మెల్యేగా ఉండగా.. మరొకరు ఎంపీగా కొనసాగుతున్నారు. జానారెడ్డికి పదవి అప్పగించాలని సీఎం రేవంత్‌ నిర్ణయం తీసుకున్నా.. పార్టీపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే చర్చ కూడా జరుగుతోంది. ఇక, మిగతా వాళ్ల విషయం చూస్తే.. వివేక్‌ వెంకటస్వామి కుటుంబం నుండి ఇప్పటికే మూడు పదవులు ఉండగా.. వివేక్‌ కేబినెట్‌ రేసులోనూ ఉన్నారట. ఇక ఉత్తమ్ కుటుంబంలో రెండు, కోమటిరెడ్డి ఫ్యామిలీలో రెండు, కేకే కుటుంబం నుంచి ఇద్దరు పదవుల్లో ఉన్నారు. మరి ఇప్పుడు జానారెడ్డికి లైన్ క్లియర్ అవుతుందా? ఆయన విషయంలో రేవంత్ ప్లాన్ వర్కౌట్‌ అవుతుందా? బెడిసి కొడుతుందా? అనేది చూడాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com