ప్రముఖ సంగీత విద్వాంసుడు, తబలా వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఇవాళ అమెరికాలో తన 73వ ఏట ఆయన తుదిశ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా జాకీర్‌కు ఐసీయూలో చేర్చారు. జాకీర్ సన్నిహితుడు, ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా ఆయన మరణాన్ని ధృవీకరించారు.
జాకీర్ హుస్సేన్ గుండె సంబంధిత సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడని రాకేష్ చౌరాసియా తెలిపారు. జకీర్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఐసీయూలో చికిత్స అందించారని, అయితే, వైద్య చికిత్సకు కూడా ఆయన శరీరం స్పందించకపోవడంతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారని వివరించారు. జాకీర్ హుస్సేన్, పురాతన తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడు. భారతీయ, అంతర్జాతీయ సంగీత రంగంలోనూ ఆయన ఎన్నో స్వరాలకు తబలా వాయిద్యాన్ని అందించారు.
జాకీర్ హుస్సేన్.. తన ఏడు సంవత్సరాల వయసులో తబలా వాయిద్య ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతేకాదు.. 12 సంవత్సరాల వయస్సులోనే భారతదేశం అంతటా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన కెరీర్లో, భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడిగా సేవలందిస్తూనే… అంతర్జాతీయ సంగీత విద్వాంసుడిగానూ విశేషమైన సేవలందించారు. జాకీర్.. తన అసాధారణమైన తబలా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ.. భారతీయ, అంతర్జాతీయ సినిమాలకు కూడా తబలా సంగీతాన్ని స్వరపరిచారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, జాకీర్ హుస్సేన్.. తన కుటుంబంతో సహా శాన్ ఫ్రాన్సిస్కోకు మకాం మార్చారు. అక్కడ ప్రపంచ సంగీత రంగంలో కీలక పాత్ర పోషించారు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడైన జాకీర్ హుస్సేన్ తన విశిష్ట కెరీర్‌లో అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, అవార్డుతో, 2002లో పద్మభూషణ్ అవార్డుతో, అలాగే, 2023లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. అలాగే, ప్రతిష్టాత్మకమైన పౌర గౌరవాలను కూడా భారత ప్రభుత్వం ఆయనకు అందించింది. 1990లో సంగీతంలో భారతదేశ అత్యున్నత పురస్కారమైన సంగీత నాటక అకాడమీ అవార్డుతో కూడా కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.