ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరోవైపు.. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 17వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే రెండు రోజల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఏపీలోని పలుప్రాంతాల్లో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన పది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా మరోసారి వాతావరణ శాఖ అల్పపీడనంపై హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల్లో ఇది మరింత బలపడి తమిళనాడు తీరం వైపు ప్రయాణించనుందని వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తమిళనాడు సహా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు.. ఈ నెల 17వ తేదీన అండమాన్ నికోబార్ పరిసరాల్లో కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చలిగాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే, ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
ఇక, తాజా పరిణమాలు, అల్పపీడనం ప్రభావం కారణంగా సోమవారం, మంగళవారాల్లో అరకు, సాలూరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈశాన్య రుతు పవనాలు చురుకుగా కదులుతుండటంతో వరుసగా అల్ప పీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటి ప్రభావంతో ఈ నెల చివరి దాకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.