తెలంగాణలో ఇటీవల మూడు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఆ మూడు పరిణామాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన హోదాపై, వ్యక్తిగత గౌరవంపై ప్రభావం చూపుతున్నాయని సీఎం రేవంత్ ఫ్యాన్స్ మైకుల్లో అరుస్తున్నారు. నెటిజన్లేమో సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇక, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా? అని ఎదురుచూసే ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ కూడా తనదైన కోణంలో అగ్గి రాజేస్తోంది. అసలు ఏంటా పరిణామాలు? ఈ స్టోరీలో వివరంగా చూద్దాం…
అల్లు అర్జున్ అరెస్ట్ :
మొన్నటికి మొన్న అల్లు అర్జున్ అరెస్టయ్యాడు. ఆ ఎపిసోడ్ తెలంగాణలోనే కాదు.. అలా అని తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదు.. జాతీయస్థాయిలో ఆ అంశం హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప-2 సినిమా బెనిఫిట్‌షోలో తొక్కిసలాట ఘటన ఆయన అరెస్టుకు కారణమయ్యింది. అయితే, అభిమానులు ముద్దుగా బన్నీ అని పిలుచుకునే అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక వేరే కోణం ఉందని సోషల్ మీడియా కోడై కూసింది.
బాలాదిత్య అరెస్ట్ తప్పదా? :
నిన్నటికి నిన్న మరో అంశం సోషల్ మీడియాను హోరెత్తించింది. హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సమయంలో మరో సినిమా నటుడు, యాంకర్ బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. అయితే, అదే సమయంలో ఓ వీడియో వైరల్ అయ్యింది. అంతేకాదు.. ఇక బాలాదిత్య అరెస్గ్ ఖాయం. త్వరలో జైలుకెళ్లనున్న బాలాదిత్య.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
జగ్గారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం? :
ఇప్పుడు సాక్షాత్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. ‘జగ్గారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం’ అంటూ ఎక్స్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై సెటైర్లు పోస్ట్ అవుతున్నాయి. వాటికి రెస్పాండ్ అయ్యేవాళ్లు కూడా భారీగానే ఉంటున్నారు.
ముగ్గురి విషయంలో కామన్ పాయింట్ :
ఇంతకీ… అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, ముప్పుతిప్పలు పెట్టడం, బాలాదిత్యను కూడా అరెస్ట్ చేయొచ్చన్న ప్రచారం జరగడం.. ఇప్పుడు జగ్గారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అంటూ సోషల్ మీడియా కోడై కూయడం వెనుక కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఆ పాయింటే ఒకరిని ఇప్పటికే జైలుకు పంపిస్తే.. మరో ఇద్దరు క్యూలో ఉన్నారన్న వాదనలపై చర్చకు ఆస్కారమిస్తోంది.
సీఎం పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ :
సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో స్టేజీపై మైకు అందుకున్న అల్లు అర్జున్ అందరికీ థాంక్స్ చెబుతున్నాడు. ఆ సినిమా విజయానికి కారకులైన వాళ్లందరి పేర్లు వల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా కృతజ్ఞతలు చెప్పబోయాడు. ఆ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ ఆగిపోయాడు. ఎందుకంటే తెలంగాణ సీఎం పేరు ఆయనకు గుర్తు రాలేదు. తడబడ్డ అల్లు అర్జున్.. పక్కన ఎవరో అందిస్తే గానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదు. అయితే, అదేదో ఇన్ హౌజ్ మీటింగ్ కాదు. ఆ సినిమా సక్సెస్ మీట్ లైవ్‌లో టెలికాస్ట్ అయ్యింది. అల్లు అర్జున్‌కు సీఎం పేరు గుర్తు లేదన్న విషయం అంతటా ఎస్టాబ్లిష్ అయ్యింది. పుష్ప-2 సినిమా తొక్కిసలాటలో ఏకంగా నిందితుడిగా చేర్చి మరీ అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. రేవంత్‌రెడ్డి పేరును మర్చిపోవడం వల్లే.. ఆయన పేరు గుర్తొచ్చేలా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారన్న సరదా విశ్లేషణలు సోషల్ మీడియాలో సాగాయి.
ముఖ్యమంత్రి పేరు మార్చేసిన బాలాదిత్య :
ఇక.. బాలాదిత్య విషయానికి వద్దాం… సంక్రాంతి పండుగకు ముందు.. హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరిగాయి. ఆ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా సినీ నటుడు బాలాదిత్య వ్యవహరించారు. షెడ్యూల్ ప్రకారమే.. ముందుగా అనుకున్నట్లుగానే.. సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ సభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి సభలోకి రాగానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలాదిత్య.. “మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు, శ్రీ కిరణ్ కుమార్ గారు..” అని ఉచ్ఛరించాడు. జరిగిన పొరపాటును వెంటనే గ్రహించాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఈవెంట్ కూడా లైవ్‌లో టెలికాస్ట్ అవుతోంది. జనమంతా చూసేశారు. రేవంత్‌రెడ్డి పేరు తప్పుగా పలికేశారు. ఇక, అక్కడే సభలో ఉన్న వాళ్లంతా ముఖ్యమంత్రి పేరు తప్పుగా పలకడంతో కేకలు వేశారు. దీంతో, ఏం చేయాలో అర్థంకాని బాలాదిత్య.. పోడియం దగ్గరినుంచి పక్కకు వెళ్లిపోయారు.
అయితే, అప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్… సోషల్ మీడియాలో జరిగిన చర్చ.. సెటైర్లు, విశ్లేషణలు బాలాదిత్యకు తెలుసు. అందుకే నష్ట నివారణకు ప్రయత్నించాడు. కొంతసేపటి తర్వాత తిరిగి పోడియం దగ్గరికి వచ్చి.. “క్షమించాలి.. మన ప్రియతమ నాయకులు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు.. శ్రీ రేవంత్ రెడ్డి గారు..” అంటూ ప్రస్తావించి కవరింగ్ ఇచ్చేశాడు. కానీ, సోషల్ మీడియా యూజర్లు ఊరుకోరు కదా.. అదే జరిగింది. ‘త్వరలో జైలుకు వెళ్లనున్న మరో సినీ నటుడు’ అని సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. ఆ కామెంట్లకు బాలాదిత్య వ్యాఖ్యానంతో కూడిన వీడియోను కూడా జోడించారు. అది చూసిన రేవంత్‌రెడ్డి అభిమానులు మరింత రెచ్చిపోయారు. ఇక, బీఆర్‌ఎస్ అనుబంధ సోషల్ మీడియా కూడా ఈ మెస్సేజ్ వైరల్ కావడంలో తనో చెయ్యి వేసింది. దీనికి ‘జాగ్రత్తగా ఉండు బ్రో’ అంటూ బాలాదిత్యను అప్రమత్తం చేస్తూ కామెంట్లు కూడా వచ్చాయి. ఎంత సినిమా నటులైనా మన రాష్ట్రానికే చెందిన ముఖ్యమంత్రి పేరుకూడా గుర్తుంచుకోలేరా? అంటూ విమర్శలు కూడా వచ్చాయి.
జగ్గారెడ్డి.. ఎందుకిలా? :
ఇక, నిన్నటికి నిన్న.. అంటే.. జనవరి 31వ తేదీన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇదే పొరపాటు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును జగ్గారెడ్డి మర్చిపోయారు. ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంటూ మాట్లాడారు. ముందున్న విలేకరులు అప్రమత్తం చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ఉచ్చరించారు. ‘ఈ వన్ ఇయర్‌ల రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి గారు…’ అని జగ్గారెడ్డి అనగానే ముందున్న విలేకరులు కిరణ్‌కుమార్‌రెడ్డి కాదు.. రేవంత్‌రెడ్డి అని గుర్తు చేశారు. దీంతో… ‘రేవంత్‌రెడ్డి గారు…’ అని ఆ వెంటనే.. ‘ఇంతకుముందు ఏమన్న..’ అని జర్నలిస్టులనే అడిగి ఆతర్వాత ‘ఆ సారీ… ‘ అంటూ తన ప్రసంగం కొనసాగించారు. ఇప్పుడు ఈ ప్రెస్‌మీట్ కూడా లైవ్‌లో టెలికాస్ట్ అయ్యింది.
ఇంకేముంది..? రేవంత్ రెడ్డి పేరును మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మర్చిపోవడంతో.. బీఆర్‌ఎస్ నేతలు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా? అంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ చేస్తున్నారు. దీనికి కూడా సోషల్ మీడియాలో అనుకూలంగా, ప్రతికూలంగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
జగ్గారెడ్డి ఎందుకు మర్చిపోయారు? :
ముందుగా చెప్పుకున్న ఇద్దరూ సినిమా నటులు. వాళ్లు రాజకీయాలతో నిరంతరం సంబంధాలు కొనసాగించరనేది అందరికీ తెలిసిదే. ఆ క్రమంలోనే స్టేజీమీద పొరపాటు జరిగి ఉండొచ్చు అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, జగ్గారెడ్డి స్వయంగా అధికార పార్టీ నేత. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు. అంతేకాదు.. ఇప్పుడు సాక్షాత్తూ టీపీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే.. పార్టీ కార్యవర్గంలో రెండో స్థానంలో ఉన్నారు. కానీ, జగ్గారెడ్డి ఇలా అన్యమనస్కంగా రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోవడం ఏంటన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.
హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఆగ్రహం :
మొత్తానికి రేవంత్‌రెడ్డి అభిమానులు, కాంగ్రెస్‌పార్టీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాత్రం ఈ పరిణామాలపై ఆగ్రహోదగ్రులవుతున్నారు. తరచూ ఇలా.. రేవంత్‌రెడ్డి ఇమేజ్‌ను తగ్గించేలా అవమానాలు జరగడంపై అంతెత్తున ఎగిరిపడుతున్నారు. వాళ్లు ఎవరైనా సరే.. చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారు. అప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కనీస గౌరవం పెరుగుతుందని సలహాలు కూడా ఇస్తున్నారు.