ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు వెళ్లారు. కర్నూలులో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ వెళ్లగానే అక్కడ జోష్ నెలకొంది. పెళ్లికి హాజరైన వాళ్లందరూ జగన్‌ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
కర్నూలులోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో కోడుమూరు వైఎస్‌ఆర్ సీపీ నేత, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్ష వర్థన్ రెడ్డి కూతురు వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరైన జగన్ వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలను ఆశీర్వదించారు. నూతన జంటకు వివాహ శుభాకాంక్షలు తెలియ జేశారు.
ఇవాళ ఉదయం తాడేపల్లి లోని తమ నివాసం నుంచి హెలికాప్టర్‌లో కర్నూలు వెళ్లారు వైఎస్ జగన్. కర్నూలు లోని జొహరాపురం రోడ్డులో ఉన్న మైపర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్ష వర్థన్ రెడ్డి కూతురు, అల్లుడిని ఆశీర్వదించారు. అక్కడికి వచ్చిన వైఎస్‌ఆర్ సీపీ నేతలతో కొద్దిసేపు వైఎస్ జగన్ ముచ్చటించారు.
జగన్.. ఫంక్షన్‌హాల్‌కు చేరుకోగానే.. సందడిగా మారింది. జగన్‌ను చూసేందుకు, దూరం నుంచే ఫోటోలు తీసేందుకు పెళ్లికి వచ్చిన వాళ్లు, వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు పోటీ పడ్డారు. అలాగే, ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు కూడా ఉత్సాహం చూపించారు. కొద్దిసేపు ఆ పెళ్లి వేడుకలో గడిపిన వైఎస్ జగన్.. తర్వాత తిరిగి తాడేపల్లి బయలుదేరారు.