26.7 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

ఛత్తీస్‌గఢ్‌లో కొత్త అధ్యాయం – మావోయిస్టు ప్రాంతంలో బైక్‌పై మంత్రి పర్యటన

  • ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సాహసయాత్ర

  • మావోయిస్టు ప్రభావిత గ్రామంలో ప్రజలతో ముఖాముఖి

ఛత్తీస్‌గడ్‌ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి విజయ్‌ శర్మ సరికొత్త ప్రయోగం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి బైక్‌పై వెళ్లారు. భద్రతా బలగాల పహారాలో బైక్‌పై ప్రయాణించారు. ఓ గ్రామానికి చేరుకొని అక్కడ స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. హోం మంత్రి తమ గ్రామానికి రావడం, తమతో కలిసి కింద కూర్చొని ముచ్చటించడం పట్ల గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్న విజయ్ శర్మ ఇవాళ బైక్‌పై ప్రయాణించి, నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలోని రాయగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన గ్రామస్తులతో భేటీ అయ్యి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సాహసోపేతమైన చర్యగా నిలిచింది.​

రాయగూడెం గ్రామం పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను తుదముట్టించేందుకు డెడ్‌లైన్ పెట్టడం వంటి పరిణామాలతో అక్కడ గంభీర వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఒక హోంమంత్రి స్వయంగా బైక్‌పై ఆ ప్రాంతంలో పర్యటించడం సాహసోపేతమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.

జనవరి 30వ తేదీన ఈ ప్రాంతంలో జరిగిన నక్సల్స్ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ దాడి తర్వాత, ఫిబ్రవరి 3వ న విజయ్ శర్మ గ్రామాన్ని సందర్శించి, స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. ​

మార్చి 29వ తేదీన సుక్మా జిల్లాలోని కెర్లపాల్ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 16 మంది నక్సల్స్ మరణించారు. ఈ సందర్భంగా విజయ్ శర్మ మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్చ కేంద్ర ప్రభుత్వాలు శాంతిని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నాయని, సమర్థవంతమైన లొంగుబాటు విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. అలాగే, ఈ ఆపరేషన్‌లో ఏకే-47 రైఫిళ్లు మరియు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ​

విజయ్ శర్మ రాజకీయ ప్రస్థానం చూస్తే, 2023లో కవర్ధా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆపై ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అలాగే, హోం, జైలు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, సాంకేతిక విద్య మరియు ఉపాధి, విజ్ఞాన సాంకేతిక శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ​

నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఒక హోంమంత్రి స్వయంగా బైక్‌పై పర్యటించడం, గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడడం ద్వారా ప్రభుత్వం శాంతి స్థాపనకు సంబంధించి.. అలాగే, మావోయిస్టులను పూర్తిగా తుద ముట్టించే లక్ష్యంపై స్ప్టమైన సంకేతం ఇచ్చినట్లు అయ్యిందంటున్నారు విశ్లేషకులు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com