- తను కొడితే మామూలుగా కొట్టను కదా
- ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
- ఎక్కడి ప్రాజెక్ట్ అక్కడే ఉన్నాయి
- కాంగ్రెస్ సర్వేల్లో కూడా బిఆర్ఎస్ కే అనుకూలం
- ఫిబ్రవరి చివరి వారంలో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ
- కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
చాలా రోజుల నుంచి మౌనంగా ఉంటున్న బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సిద్దిపేట జహీరాబాద్ ప్రాంతాలకు సంబంధించిన బిఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ కార్యకర్తలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాను చాలా రోజుల నుంచి గంభీరంగా మౌనంగా ప్రభుత్వాన్ని చూస్తున్నానని ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కరోనా వచ్చినా సరే మన ప్రభుత్వ హాయంలో సంక్షేమ పథకాలు ఆపలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని అన్నారు. చివరికి కాంగ్రెస్ వాళ్ళే సొంతంగా సర్వేలు నిర్వహిస్తుంటే బిఆర్ఎస్‌కే అనుకూలంగా 70 శాతం మంది ఓటు వేశారని కేవలం 30 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారని ఆయన ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన పోల్ సర్వేను ఎత్తి చూపారు.
తాను కొడితే మామూలుగా ఉండదని గట్టిగా కొట్టడం తన అలవాటని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని విద్యుత్ సమస్యలు ప్రారంభమయ్యాయి అని గుర్తు చేశారు. ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి దివాళా స్ధితికి వచ్చిందన్న కేసీఆర్ ముందు ముందు జీతాలు ఇవ్వలేని పరిస్ధితికి వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే నెల ఫిబ్రవరి చివర్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.
మొత్తానికి చాలా రోజుల తర్వాత కెసిఆర్ ఈ రకమైన కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనని కేసీఆర్ మొదటిసారిగా ప్రభుత్వంపై స్పందించడంతోపాటు మళ్లీ తాను పబ్లిక్ లోకి వస్తున్నానని ఇండికేషన్స్ ఇచ్చారు. అయితే శుక్రవారం ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ చాలా ఉత్సాహంగా కనిపించారు. మునిపటిలో విసులు, చణకులతో ఆయన ప్రసంగం కొనసాగింది. కార్యకర్తలు కూడా కేసీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం విపరీతంగా ఎంజాయ్ చేశారు. కేసీఆర్ చేసిన ప్రతి వాఖ్యానానికి అరుపులు కేకలతో కార్యకర్తలందరూ ఉత్సహం ప్రదర్శించారు.