తెలంగాణలో ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించడానికి కృత్రిమ మేధ – ఏఐ ఆధారిత మొబైల్ యాప్ దోహదపడుతుందని మంత్రి అన్నారు. మాడ్యూర్ హాస్పిటల్ సర్వీసెస్ రూపొందించిన ‘ఎండీఆర్ మైడిజి రికార్డ్ మొబైల్ యాప్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తుడు మెరుగైన వైద్యం కోసం వేరొక ఆసుపత్రికి వెళ్తే రోగికి సంబంధించిన వివరాలను విశ్వసించడం లేదన్నారు. ఫలితంగా మరోసారి అన్ని వైద్యపరీక్షలు చేయడంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను వినియోగించుకుంటే.. సర్వీసులు మరింత సరళతరం అవుతాయన్నారు. జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాడ్యూర్ హాస్పి టల్స్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ మోటూరి కృష్ణ ప్రసాద్, సంస్థ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ సరోజ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.