తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు. విదేశాల నుంచి తిరగి వచ్చిన అయోధ్యరామిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజమని, వాటిని తట్టుకుని నిలబడితేనే నెగ్గుకు రాగలుగుతామని ఆయన చెప్పారు. విజయసాయిరెడ్డి సైతం ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదని, ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారో అది పూర్తిగా సాయిరెడ్డి వ్యక్తిగతమని అన్నారు. విజయసాయిరెడ్డి ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకున్నారో ఆయనే చెప్పారని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి అన్నీ సరిగ్గా జరిగి ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేదని అయోధ్యరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి రాజకీయ పార్టీకి ఎత్తు పల్లాలు సహజమని, అలాగే అధికార వ్యవస్ధల నుంచి ఒత్తిళ్ళు కూడా ఉంటాయని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. మా పార్టీ ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉన్నాయని ఓటమిలో కూడా వాటిని తట్టుకుని నిలబడాలని అన్నారు. కష్టాలు వచ్చినప్పుడే మన పోరాట పటిమ తెలుస్తుందని.. పార్టీ మనుగడ కొనసాగాలంటే అందరూ కలసికట్టుగా పోరాటం చెయ్యాలని అయోధ్యరామిరెడ్డి వైఎస్సార్పీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- Advertisement with us -