28.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

చంద్రబాబు చేతులెత్తేశారా…

  • ఆర్థిక స్ధితి బాలేదనే సాకుతో సంక్షేమ పథకాలకు ఎగనామం
  • తనకు అమరావతే ముఖ్యమని చెప్పకనే చెప్పిన ఏపీ సీయం
  • కేంద్ర నిధులు పథకాలకు మళ్లిచలేనని స్పష్టం

ఎన్నికల హామీలు అమలు చెయ్యడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పెద్దగా ఆసక్తి చూపరనే విషయం మరోసారి రుజువయ్యింది. ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా అలవి కాని హామీలు ఎన్నో ఇచ్చేసి తీరా అధికారంలోకి వచ్చాక కుంటి సాకులు చెప్పి హామీలకు ఎగనామం పెట్టడం చంద్రబాబు స్టైల్‌ ఆఫ్‌ రాజకీయం. ఈ తడవ కూడా అదే జరిగింది. తాను ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూర్‌ సిక్స్‌ పథకాలు అమలు చెయ్యడానికి ఖజానాలో డబ్బులు లేవని తేల్చి చెప్పేశారు. డబ్బులు సంపాదించిన నాడు చూద్దాం అని తేల్చిపడేశారు. మొత్తంగా ఆయన చెప్పేదేంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు… రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంది… ఇందతా గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్వాకం… ప్రజలకు నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేకపోవడానికి జగనే కారణం అని కుండబద్దలు కొట్టేశారు. ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టాలంటే తొమ్మొదేళ్లు పట్టచ్చు… పదేళ్లు పట్టచ్చు… అది గాడిలో పడి సంపద సృష్టించి… ఆర్థిక వృద్ధి రేటు 15 శాతానికి పెరిగినప్పుడే సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చెయ్యగలుగుతామని చెప్పేశారు. అంటే 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే చంద్రబాబును మరో రెండు తడవలు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకుంటే 2034లో ఏర్పడే కూటమి ప్రభుత్వం హయాంలో సూపర్‌ సిక్స్‌ అమలు చేసే అవకాశం ఉంటుంది.

నీతి ఆయోగ్‌ నివేదిక సమర్పణ సందర్భంగా చంద్రబాబు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం గురించి రాష్ట్ర ప్రజలకు ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం వద్ద చాలా డబ్బులు ఉన్నాయి కదా ఎన్నికల హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదని అనుకుంటున్నారని… నమ్మి ఓటు వేశాం కదా పథకాలు ఏమయ్యాయనే ఫీలింగ్‌ లోకి రాష్ట్ర ప్రజలు వెళుతున్నారని వారికి క్లారిటీ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం కోసం, అమరావతి అభివృద్ధి కోసం 27 వేల కోట్ల వరకూ వచ్చాయని అలాగే విశాఖ ఉక్కు పునరుద్దరణ కోసం కూడా మరో 11వేల కోట్ల పైచిలుకు నిధులు ఇచ్చిందని కానీ వాటిని పథకాలకు మళ్లించలేనని చంద్రబాబు అంటున్నారు. అస్తవ్యస్ధంగా ఉన్న రాష్ట్ర అర్థిక పరిస్ధితులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నానని ఇందుకు ఎంత సమయం పడుతుందో తెలియడం లేదని చెపుతూ ఎన్నికల హామీలు ఇప్పట్లో అమలు చెయ్యలేనని ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గత ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసి మూలధనం వ్యయం తక్కువ చేసిందని, వృద్ధి రేటు తగ్గిపోయిందని ప్రజలకు అర్ధంకాని లెక్కలు చెపుతూ తాను పథకాలు అమలు చేయలేకపోవడం వెనుక జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని ప్రజలు అర్ధం చేసుకోవాలనే తాపత్రయం ఆయనలో కనిపించింది.

అయితే 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్ధితులు గత ప్రభుత్వ పోకడలు ఇవేవీ దృష్టిలో పెట్టుకోకుండానే ఎన్నికల్లో అమలు చేయలేని హామీలు చంద్రబాబు ఇచ్చారా అని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తు్న్నాయి. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రజలను సోమరిపోతులను చేస్తు్న్నారని, సంక్షేమ పథకాల పేరుతో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు పంచేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబుకి అప్పుడు తాను ఇస్తున్న హామీలు అమలు చేయలేనని తెలియదా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తు్న్నారు. నేను ముఖ్యమంత్రి అయితే జగన్‌లా అప్పులు చేసి పథకాలు అమలు చెయ్యనని నాకు సంపద సృష్టించడం వెన్నతో పెట్టిన విద్యాని సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని ఊరూరా తిరిగి చెప్పారు చంద్రబాబు. ఇప్పుడు సంపద సృష్టించడానికి పదేళ్ళు పట్టచ్చని నమ్మి ఓట్లు వేసిన ప్రజలని మోసం చేస్తు్న్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏడు నెలలు కూడా కాకుండానే చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పై చేతులెత్తేశారని తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. దీనిపై పవన్‌ కళ్యాణ్‌ ఏ గుడి మెట్లు కడుగుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక అంబటి రాంబాబు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేనని స్వయంగా చెపుతూ చంద్రబాబాబు తన అసమర్ధతను అంగీకరిస్తున్నట్లే అని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్‌ లెక్కలు చెపుతూ గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేమని చెప్పడం చంద్రబాబు దివాళాకోరు తనానికి నిదర్శనమని అంబటి వ్యాఖ్యానించారు.

ఏతావాతా చూస్తే సకల రోగాలకు జిందా తిలిస్మాత్‌ మందు అన్నట్లు చంద్రబాబు తన వైఫల్యాలకు, ఎన్నికల హామీలు అమలు చేయలేకపోవడానికి, దావోస్‌లో పెట్టుబడులు ఆకర్షించలేకపోవడానికి అన్నింటికీ కారణం గత జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అనుసరించిన విధానాలే అని చెప్పి తప్పించుకోవాలని చూస్తు్నట్లు అర్ధమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి సూపర్‌ సిక్స్‌ అమలు విషయంల చంద్రబాబు చేతులెత్తేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎలా చూస్తారో వేచిచూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com