- పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ
- రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ శివారుల్లో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన “డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీ రంగంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న మంత్రి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. అందుకే హైటెక్ సిటీ తరహాలోనే కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. వీటిని ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి… నగర శివారుల్లో ఏయే ప్రాంతాల్లో ఇందుకు అనుకూలంగా ఉన్నాయో సంబంధిత యంత్రాంగం అధ్యయనం చేస్తోందని వివరించారు. ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. ఎక్కడి నుంచైనా ఈ పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాఫ్ట్ వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తాంమని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటీ వరకు ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదని దీని వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారని అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించామని వెల్లడించారు. పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తాం అని అన్నారు. హైదరాబాద్ లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్ వేర్ కంపెనీని సంతోషంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని రాబోయే అయిదేళ్లలో ఈ సంస్థ 900 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది అని వివరించారు. కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ డా.విష్ణువర్ధన్ రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, డ్యూ వెంచర్స్ ప్రెసిడెంట్ సురేష్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.