కారణాలు పెద్దవే…
సిరియా ఇప్పటికే రెబల్స్ వశమైంది. అధ్యక్షుడిగా ఉన్న బషర్ అల్ అసద్ ఇప్పటికే రష్యా వెళ్లి తలదాచుకున్నాడు. సిరియాలో కొత్త ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుందో? మళ్లీ ఆ దేశం ఐసిస్ చేతుల్లోకి వెళ్లిపోతుందేమో? ఇలా అనేక అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు వేరే పనిలో బిజీగా ఉంది. వరుసగా సిరియాపై ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహిస్తోంది. అయితే ఇజ్రాయెల్‌కు సిరియాపై ఎందుకింత స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతోంది.
సిరియా, ఇజ్రాయెల్ రెండింటి మధ్య సరిహద్దు ఉంది. ఇరు దేశాల మధ్య వివాదస్పద ప్రాంతం ఉంది అదే గోలైన్ హైట్స్. 1974లో దీనిని బఫర్‌జోన్‌గా ప్రకటించారు. కానీ ఒప్పందం చేసుకున్న అసద్ ఇప్పటికే పారిపోయాడు కాబట్టి.. ఆ ఒప్పందం ఇక చెల్లదు.. గోలెన్ హైట్స్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలని ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీని ఆదేశించాడు ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. అయితే సిరియా రాజధాని డమాస్కస్‌పై దాడులు కూడా జరుపుతోంది ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్.
ఇజ్రాయెల్ దీనికి ఓ కారణం ఉందని చెబుతోంది. సిరియన్ ఆర్మీకి చెందిన ఆయుధాలతో పాటు రాకెట్ లాంచర్లు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు రెబల్స్‌కు దక్కకూడదన్నే తమ ఆలోచన అని.. అవి వారి చేతిలో పడితే ఇజ్రాయెల్‌కు మాత్రమే కాదు.. లెబనాన్, జోర్డాన్‌కు కూడా ముప్పు ఉందని చెబుతోంది ఇజ్రాయెల్. నిజానికి ఇది సత్యమే. కానీ అర్ధసత్యం మాత్రమే. ఇక మిగిలిన అర్ధసత్యం ఏంటంటే.. ఇరాన్ న్యూక్లియర్ రిసెర్చ్‌ను సిరియాలోనే నిర్వహించిందనేది ఇజ్రాయెల్ అనుమానం. సిరియాకు ఇరాన్, రష్యా వెన్నుదన్నుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ రష్యా ఎయిర్‌బేస్ కూడా నిర్వహించింది. ఇరాన్‌లో చీమ చీటుక్కుమన్న ఇజ్రాయెల్‌కు తెలిసిపోతుంది కాబట్టి.. దానికి సంబంధించిన రీసెర్చ్‌ను సిరియాలో నిర్వహించారని ఇజ్రాయెల్ అనుమానం. అందుకే సిరియా రెబల్స్ వశం కాగానే ఇజ్రాయెల్ మొదట చేసిన దాడులన్ని సిరియన్ ఆర్మీ రీసెర్చ్ అండ్ డెవలప్‌సెంటర్స్‌పైనే. ఇది సిరియాతో పాటు.. ఇరాన్‌కు కూడా పెద్ద దెబ్బే అని చెప్పాలి.
సిరియా మాత్రమే కాదు అమెరికన్ సెంట్రల్ కమాండ్ కూడా సిరియాలోని ఐసిస్‌కు చెందిన 75 టార్గెట్లను నాశనం చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తాము చేసిన దాడులను సమర్ధించుకున్నారు. ఇదంతా ఉగ్రవాదం బలపడకుండా చూడటంలో భాగమనే చెబుతున్నాయి అమెరికా, ఇజ్రాయెల్.