పోడు రైతులకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభవార్త అందించారు. త్వరలోనే పోడు భూముల్లో సాగుకు సోలార్ పవర్ అందిస్తామని ఈరోజు(మంగళవారం) ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజావాణి ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల అవసరాలు, వారి ఇబ్బందులు నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిందని ఉపముఖ్యమంత్రి అన్నారు. ప్రజావాణిలో తమ దరఖాస్తులకు పరిష్కారం దొరికిందని ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజలకు జవాబుదారీగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ప్రజల కోసమే పని చేస్తున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు లక్ష్యాలను గత పాలకులు విస్మరించారని ఆరోపించారు.
ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ప్రజల కోసమే పని చేస్తున్నాయన్న భావన ప్రజల్లో కలిగించినప్పుడే ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన వారం అవుతామని అన్నారు. భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్స్ లో పేర్కొన్న ప్రతి ఒక్కటి ప్రజలకు అందించే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.