రైతులకు గిట్టుబాటు ధర కోరుతూ ఈ నెల 13వ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ అన్నదాతకు అండగా వైఎస్సీర్సీపీ పోస్టర్ ను పార్టీ నేతలు మంగళవారం ఆవిష్కరించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, రుహుల్లా తదిరత నాయకులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పోష్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ళ విషయమై ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలను చేయాలని వైఎస్.జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్ రైతుల వద్దకు వెళ్ళి ప్రతి గింజా కొంటామని, రైతులు ఫోన్ లో మెసేజ్ చేస్తే చాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిజమని నమ్మిన రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా పట్టించుకున్న వారే లేరని అంబటి అన్నారు. 75 కేజీలకు 1725 రూపాయలు ఎక్కడా ఇవ్వడం లేదని తేమ శాతం ఉందని సాకులు చెప్పి 1300 కొంటున్నారని విమర్శించారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తరువాత రుణమాఫీ చెయ్యకుండా మోసం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని అంబటి ఆరోపించారు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాస్ అసలే లేదు. ఈ పరిస్థితిలో రైతుకు అండగా వైయస్ఆర్ సిపి నిలబడుతుందని అంబటి రాంబాబు ప్రకటించారు.
- Advertisement with us -