రాజ్యసభలో అవిశ్వాసంపై వైసీపీ అడగులెటు?
పక్ష పాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ నిన్న రాజ్య సభ ఛైర్మన్ పై విపక్షాలు మూకుమ్మడిగా అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నేపధ్యంలో ఆ తీర్మానం భవితవ్యం ఏమవుతుంది? నిన్న ఛైర్మన్ పై దాదాపు 70 మంది సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాసతీర్మానాన్ని విపక్ష నేతలు సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, త్రుణమూల్, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడి, ఆప్ , లెఫ్ట్ పార్టీలు ఈ తీర్మానాన్నిసమర్ధించాయి. ఇండియా కూటమి ఐక్యంగానే ఈ తీర్మానం ప్రవేశ పెట్టినా కూటమి ఛైర్మన్ పదవిపై ఎన్నో సందిగ్థతలున్నాయి. రాహుల్ నాయకత్వంపై త్రుణమూల్ లాంటి పార్టీలకు నమ్మకం లేదు. ఈ మధ్య మమతా బెనర్జీ కూడా కూటమి బాధ్యతలు చేపట్టడానికి సిద్దమేనని అటు సీఎంగా, ఇటు కూటమి నేతగా కూడా వ్యవహరించగలనని సంకేతాలివ్వడం, ఆమెకు లాలూ ప్రసాద్ యాదవ్ సహా మరికొన్ని పార్టీల నేతలు మద్దతు పలకడం తెలిసిందే. ఇలా ఇండియా బ్లాక్ లోనే ఎన్నో అసంత్రుప్తులున్నాయి.
వైసీపీ అడుగులెటు?
వైసీపీ ఇప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణ వైఖరులు అవలంబించలేదు.2019 లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే బీజేపీతో ఘర్షణ వైఖరి ఉండదని, అంశాల వారీగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు ద్రుష్టిలో ఉంచుకుని మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. అన్నట్లుగానే పార్లమెంటు ఉభయ సభల్లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎంపీలు ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా మద్దతు పలికారు. గతంలో మణిపూర్ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని ఎండగడుతూ విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఆ సమయంలో కూడా వైసీపీ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగానే నిలబడింది.అలాగే స్పీకర్ ఎన్నిక సందర్భంలోనూ వైసీపీ బీజేపికే మద్దతు పలికింది. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులోనూ వైసీపీ బీజేపీకే మద్దతు పలికింది. మరిప్పుడు వైసీపీ ఏం చేస్తుంది?
రాజ్యసభలో తగ్గిన బలం
గతంలో వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలుండేవారు. వీరిలో కొందరు పార్టీ మారిపోవడం, ఏపీలో పార్టీ ఓటమి తర్వాత తగ్గిన బలం, మరికొందరు రిటైర్ అవుతున్న క్రమంలో ఆ బలం గణనీయంగా పడిపోయింది..పార్టీనుంచి ఒక్కొక్క ఎంపీ తగ్గిపోతున్న నేపధ్యంలో అవిశ్వాసంపై వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుందన్నది కీలకంగా మారింది. మరోవైపు జమిలి ఎన్నికలు వస్తాయన్న వార్తలూ హల్ చల్ చేస్తున్నాయి. ఏపీలో కూటమి పాలన అస్తవ్యస్తంగా ఉండటంతో జమిలి లేదా, మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న అంచనాతో పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికల బిల్లు వస్తే ఎన్డీఏకు అనుకూలంగా వైసీపీ వ్యవహరించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
విజయ సాయి కామెంట్లు వైరల్..
మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ బీజేపికి దూరం జరుగుతూ వస్తోంది. పైకి ప్రకటించనప్పటికీ గతంలో ఉన్నంత మద్దతు ఇప్పుడు ఇస్తుందా అన్నది సందేహం. ఎందుకంటే బీజేపి పెద్దలతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మంచి సంబంధాలే కలిగి ఉన్నా.. ఇండియా కూటమికి మమత నేత్రుత్వం సరైనదని విజయసాయి కామెంట్ చేయడం సంచలనంగా మారింది. కారణం మొదట్నుంచి కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్ తో అడుగులేస్తున్న వైసీపీ ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ బీజేపి దోస్తీ నేపధ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా కూటమికి మమత మద్దతు పట్ల వైసీపీ ఈ కామెంట్ చేయడం చూస్తుంటే కాంగ్రెస్ కి సమాంతరంగా అడుగులేస్తున్నదీదీకి మద్దతు ఇవ్వడం మంచిదని వైసీపీ భావిస్తోందా?
రాజ్యసభలో ఎన్డీఏ బలం
రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుండగా అందులో ఎన్డీఏ కూటమికి 125 మంది ఎంపీలున్నారు. మరోవైపు విపక్షాలకు 112 మంది ఎంపీలుండగా అందులో ఇండియా కూటమికి 88 మంది సభ్యులున్నారు. దీనిలో కాంగ్రెస్ బలం కేవలం 27 మంది మాత్రమే. ఏదైనా బిల్లులు గట్టెక్కాలంటే కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది.రాజ్యసభలో ఆరు సీట్లకు ఈనెల 20 ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఏపీ, ఒరిస్సా , హర్యానాలలో ఎన్డీఏకు భారీగా బలం ఉన్నందున ఆరు సీట్లలో ఐదు సీట్లు ఎన్డీఏ ఖాతాలో పడనున్నాయి. ఈ నేపధ్యంలో రాజ్యసభలో ఎన్డీఏ బిల్లుల ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూరినట్లవుతుంది. దీంతో జమిలి ఎన్నికల లాంటి కీలకమైన ప్రతిపాదనలు సునాయాసంగా గట్టెక్కే అవకాశముంది.
అంత ఈజీ కాదు..
పైగా లోక్ సభలో అవిశ్వాసం పెట్టినంత ఈజీ కాదు రాజ్యసభలో. ఇది వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడ ఎంపీలుగా ఉంటారు.కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులను కాపాడేది రాజ్యసభే. కాబట్టి ఇక్కడ అవిశ్వాసం పెట్టడం అంత సులభం కాదు..అయినా రాజ్యసభ ఛైర్మన్ పై ఇవాళ కూడా కాంగ్రెస్ తన విమర్శల పరంపర కొనసాగించింది.