34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

ట్రంప్ వీసా పాలసీ వల్ల ఇండియన్స్ కి లాభమా? నష్టమా?

శ్వేత సౌధం పగ్గాలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ వీసా పాలసీమీద, ఇమ్మిగ్రేషన్ చట్టాలపైనా.. రోజు కో ప్రకటన చేస్తూ యూఎస్ లో ఉంటున్న ఇతర దేశీయులకు టెన్షన్ పెంచుతున్నారు. తాజాగా బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో అమెరికాలో ఉండాలనుకుంటున్న వేలాది మంది ప్రవాసీయుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. బర్త్ రైట్ సిటిజన్ షిప్ అన్నది ఓ పనికిమాలిన చట్టమని, తాను అధికారం చేపట్టగానే దానిని తొలగిస్తానని అన్నారు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 వ రాజ్యాంగ సవరణ ఈ చట్టాన్ని తెలియచేస్తుంది.అమెరికా సరిహద్దుల్లో జన్మించిన పిల్లలకు వారి తల్లి దండ్రుల ఇమ్మిగ్రేషన్ స్టేటస్ తో సంబంధం లేకుండా పౌరసత్వాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ అది. వాస్త వానికి గతంలో అధికారంలోకి వచ్చినప్పుడే ఇమ్మిగ్రేషన్ చట్టాల తుట్టను ట్రంప్ కదిపారు. ఆ ప్రక్రియను పూర్తిగా చేపట్టకుండానే మధ్యలోనే వదిలేశారు.మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి అది ఈసారి కఠినంగా అమలుచేస్తారా? అసలు చేయగలరా?అన్నది ప్రశ్న.ప్రస్తుతం ఉన్న విధానాలు అమెరికాను బర్త్ టూరిజం స్పాట్ గా మార్చేస్తున్నాయని ట్రంప్ అనుకూల వర్గం కామెంట్ చేస్తోంది. ప్రతీ ఒక్కరు ఇక్కడికొచ్చి బిడ్డలను కని పౌరసత్వం పొందేస్తున్నారని అమెరికా పౌరసత్వం పొందడానికి అదొక మార్గంలా మారిపోయిందని ట్రంప్ వాదిస్తున్నారు.

దీని ప్రభావం భారత్ పై ఉంటుందా?

ట్రంప్ ప్రకటనతో భారతీయులలో గుబులు కనిపిస్తోంది. ఎందుకంటే 2022 లెక్కల ప్రకారం అమెరికాలో ఉంటున్న మన భారతీయుల్లో అక్కడి సిటిజన్ షిప్ పొందిన వారే దాదాపు పది లక్షల 60 వేల మందికి పైగానే ఉన్నారు. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు చేస్తే వారందరి పరిస్థితి అగమ్యగోచరమే అవుతుంది. లక్షల మంది భారతీయులతో పాటు ఇంకా లక్షల్లొ ఉన్న ఇతర దేశీయుల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న వారందరినీ ఒదులుకోవడం అంత సులభం కాదు. కానీ ఈ విధానం అమలు ప్రక్రియ అంత సులభం కాదంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి ఈ చట్టం నిబంధనలు మార్చాలన్నా, దానిని తొలగించాలన్నా అంత సులభం కాదు.ఎందుకంటే ఇప్పుడున్న ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం అమెరికన్ పౌరులు తమ బిడ్డల సిటిజన్ షిప్ ను ప్రూవ్ చేసుకోడానికే చాలా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. బర్త్ సర్టి ఫికేట్ ఒక్కటే కాదు. అందుకు అనుబంధంగా,పకడ్బందీగా నిరూపించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.పైగా ఇమ్మిగ్రేషన్ కి సంబంధించిన కేసులు దాదపు 20 లక్షలకుపైగా పరిష్కారం నోచుకోక పెండింగ్ లో ఉన్నాయి. ఈకేసుల విచారణ, పరిష్కారం అంత వేగంగా జరగడం లేదు.కారణం అక్కడున్న ఇమ్మిగ్రేషన్ సిబ్బంది సరిపోవడం లేదు. దాంతో కేసుల పరిష్కారం దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం లేదు. పైగా ఈసారి గతంలోకంటే ట్రంప్ కి ఓటు వేసిన వారిలో 14 శాతం ఎక్కువ మంది లాటిన్ అమెరికన్స్ ఉన్నారు. వారికి ఇబ్బంది కలిగించే ఇమ్మిగ్రేషన్ విధానం మార్పులు సాధ్యమా? ప్రస్తుత విధానాన్నిమార్చడం చాలాఖర్చుతో కూడుకున్న వ్యవహారం..దీనికి తోడు రాజ్యాంగ పరమైన చిక్కుముడులు , సంక్లిష్టతలు ఉన్నాయి.

హెచ్ వన్ బీ వీసాల్లో కోత?

గతంలో అధికారం చేపట్టినప్పుడే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఎన్నో మార్పులు చేశారు. అప్పట్లో హెచ్ వన్ బీ వీసాలు కలిగిన అనేక మంది భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ట్రంప్ దెబ్బకు బలయ్యారు. మరిప్పుడు? మొన్నటి ఎన్నికల ప్రచారంలో ఇమ్మిగ్రేషన్ అంశంపైనే ట్రంప్ ఎక్కువ మాట్లాడారు. తమ దేశంలోకి లీగల్ గా ఇమ్మిగ్రంట్స్ వస్తే ఇబ్బందులేమీ లేవని అక్రమంగా వచ్చిన వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఓ అంచనా ప్రకారం అమెరికాలో కోటిమంది సరైన డాక్యుమెంట్లు లేని ఇమ్మిగ్రంట్స్ ఉన్నారు.

నిజానికి భారతీయులెవరూ అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించేది తక్కువే. కాబట్టి ట్రంప్ విధానం ఒక రకంగా భారతీయులకు మేలే చేస్తుందా? ప్రతిభకు తగిన గుర్తింపు, మంచి జీవితం, జీతం కోరుకుని అమెరికా వెళ్లే ఇండియన్ టెకీలకు అమెరికా ఎప్పుడూ పెద్ద పీట వేస్తూనే వచ్చింది. సక్రమంగా పాస్ పోర్టుతో ఆదేశంలో ఉంటూ ఉద్యోగం, లేదా చదువు, లేదా వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు. సాధారణంగా చదువు , లేదా ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే భారతీయులే ఎక్కువ కాబట్టి ప్రతిభ కలిగిన వారికి, సాఫ్ట్ వేర్ టెకీలకు ట్రంప్ రాకతో మంచి అవకాశాలే ఉంటాయనుకోవచ్చు. ఇన్నాళ్లు ఫామిలీ తో కూడిన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అనుసరించిన అమెరికా ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా తరహా ఇమ్మిగ్రేషన్ విధానాలనుఅనసరిస్తుంది. అదే గనక జరిగితే స్కిల్డ్ ప్రొఫెషనల్ప్ కు అమెరికా పెద్దపీట వేస్తుంది. కానీ అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వారికి మాత్రం ఇది దెబ్బ. అయితే ట్రంప్ తాను అనుకున్న విధానాన్ని అమల్లోకి తేగలరా?

ట్రంప్ 2.0 లో భారత్ కు పెద్దపీటే..

శ్వేతసౌధంలో ఎవరు పగ్గాలు చేపట్టినా భారతీయులకు ఎక్కువ ప్రయారిటీ దక్కుతూనేఉంది. ప్రస్తుత బైడెన్ ప్రభుత్వ యంత్రాంగంలోనూ కీలక పదవుల్లో ఇండియన్ అమెరికన్స్ చాలా మందే ఉన్నారు. ఈసారి ట్రంప్ అధికార యంత్రాంగంలో ఇండియన్ అమెరికన్స్ చాలా ఎక్కువమందికే అవకాశాలు వచ్చాయి. కీలకమైన రక్షణ, ఇమ్మిగ్రేషన్, ఆర్థిక రంగాల్లో వారికి ఉన్నత పదవులు దక్కాయి. హర్మీత్ థిల్లాన్, ఉషా వాన్స్, జయా భట్టాచార్య, కశ్యప్ పటేల్, వివేక్ రామస్వామి, తులసి గబ్బార్డ్ లకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పదవులు దక్కాయి. వీరిలో హర్మీత్ థిల్లాన్ యూఎస్ న్యాయశాఖలో అసిస్టెంట్ అటార్నీజనరల్ గా నియమితులయ్యారు. సాక్షాత్తు వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ భార్య అయిన ఉషా చిలుకూరి యూఎస్ సెకండ్ లేడీ హోదాలో ఉన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరక్టర్ గా జయ భట్టాచార్య, ఎఫ్ బీఐ డైరక్టర్ గా కశ్యప్ పటేల్, గవర్న మెంట్ ఎఫిషియన్సీ శాఖ హెడ్ గా వివేక్ రామస్వామి, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ గా తులసీ గబ్బార్డ్ నియమితులయ్యారు. ఇంత కీలక పదవుల్లో వారిని ట్రంప్ నియమించడం అంటేనే భారత్ కు దక్కుతున్న ప్రాధాన్యతను మనం అర్ధం చేసుకోవచ్చు.కాబట్టి భారత, అమెరికా సంబంధాలు , ఇమ్మిగ్రేషన్ విధానంతో సహా గణనీయంగా మెరుగు పడతాయనే భావించాలి. ట్రంప్ 2.0 హయాంలో భారత్ టెకీలకు పెద్దగా ఎదురయ్యే ఇబ్బందులేవీ ఉండవనే అనుకోవాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com