23.3 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

పోలీసులు బాధ్యత మరుస్తున్నారా? నేరాలు పెరిగేలా ప్రవర్తిస్తున్నారా?

– బాధితులనే నిందితులవుతారని భయపెడుతున్నారా?
– సమాజంలో నేరాలు పెరగడానికి కారణమవుతున్నారా?
– ఈ పరిస్థితులకు కారణమెవరు?
– వీటిని చక్కదిద్దే బాధ్యత ఎవరిది?

ఓ కన్నతండ్రి ఆవేదన ఇది…
ఓ సగటు మనిషి ఆక్రోశం ఇది…
నేరాలను తేలిగ్గా తీసుకుంటున్నారనడానికి సాక్ష్యమిది…
పోలీసులది ప్రేక్షకపాత్ర అనడానికి నిదర్శనం ఇది…
పోలీసు వ్యవస్థను వెక్కిరించే యదార్థ ఘటన ఇది…
పాలకుల్లో మత్తును వదిలించే షాకింగ్‌ పరిణామం ఇది…

అవును.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వ్యవహారశైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పరిణామం అందిరినీ ఔరా! అనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తోంది. మొత్తానికి సమాజాన్ని, అధికార వ్యవస్థను, పాలనా యంత్రాంగాన్ని నిలదీస్తోంది. పోలీసుల విధి నిర్వహణలు ఇంతేనా? అని నిగ్గదీస్తోంది.

ఓ హత్య జరిగింది. ఎవరు చేశారో తెలియదు. ఎందుకు చేశారో తెలియదు. నిఘా వ్యవస్థ రెక్కలు కట్టుకొని డేగలా చూస్తోందన్న వాదనల మధ్య, సాంకేతిక యుగంలో నేరస్తులెవరూ తప్పించుకునే ప్రసక్తే లేదని ఖాకీలు చేస్తున్న ప్రకటనల మధ్య ఈ హత్య ఓ సవాల్‌గా మారింది. కానీ, నిందితుడే ఆ హత్య చేసింది తానే అని చెబితే తప్ప పోలీసులు కూడా తెలుసుకోలేకపోయారు. మరి.. నిందితుడు స్వయంగా వీడియో విడుదల చేసినా.. అతన్ని ఇప్పటికిప్పుడు పట్టుకొని కటకటాల్లోకి పంపించే అవకాశం లేదు. తనకు తాను వచ్చి పోలీసులకు లొంగిపోతే తప్ప వెంటనే అతన్ని అరెస్టు చేసే పరిస్థితి కూడా లేదు. అయితే, తానే వచ్చి పోలీసులకు లొంగిపోతానని నిందితుడు ప్రకటించాడు. ఇది కాస్త ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు ఉపశమనం కలిగించే ప్రకటనగా చెప్పుకోవచ్చు.

ఎక్కడ జరిగింది? ఏం జరిగింది?

ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేటలో ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. గత శనివారం తెల్లవారు జామున జరిగిందీ సంఘటన. చనిపోయింది వృద్ధుడు. పైగా దివ్యాంగుడు. అత్యంత దారుణంగా హతమార్చారు. అలా అని అతనేమీ వ్యాపారవేత్తకాదు. భాగస్వామ్య తగాదాల్లో అతన్ని టార్గెట్ చేయడానికి. డబ్బుల కోసం చేశారనుకున్నా.. పెద్దగా ఆస్తిపరుడు కాదు. ఏదైనా వివాదాల్లో తలదూర్చాడనుకున్నా అదీ లేదు. వేరేవాళ్లను టార్గెట్ చేయబోయి అనుకోకుండా ఇతన్ని చంపేశారనడానికి కూడా క్లూలు లేవు. అయితే, ఈ హత్య గ్రామస్తులను ఆలోచనలో పడేసింది. పోలీసులకైతే సవాల్‌గా మారింది. కానీ, ఈ హత్యకేసును ఛేదించే ఆధారాలేవీ పోలీసులు దొరికించుకోలేకపోయారు.

పోలీసులకు సవాల్ :

శనివారం తెల్లవారే సరికి ఆంజనేయులు మర్డర్‌ వార్త ఊళ్లోనే కాదు.. జిల్లావ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కానీ, ఆధారాలు లేవు. చనిపోయిన వృద్ధుడికి ఎవరితోనూ గొడవలు లేవు. మరి.. ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇటీవలే వాళ్లకు సంబంధించిన బంధువుల మధ్య వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కానీ, ఆ వివాదం హత్యకు దారితీసే అవకాశమే లేదనుకున్నారు. పైగా అవతలి పార్టీవాళ్లు ఇప్పుడు కువైట్‌లో ఉన్నారు. వాళ్లెవరూ ఈమధ్య కాలంలో రాలేదు. ఇక, వచ్చి హత్యచేశారనుకున్నా.. కువైట్‌ నుంచి వచ్చి హత్య చేసి మరీ తిరిగి వెళ్లిపోయేంత సీన్‌ లేదనుకున్నారు ఇక్కడి పోలీసులు. అయితే, వెతకబోయే తీగ కాలికి తగిలిందన్న చందంగా నిందితుడే వీడియో విడుదల చేస్తే తప్ప పోలీసులు తెలుసుకోలేకపోయారు.

ఎలా తెలిసింది?

నిందితుడే రియలైజ్‌ అయ్యాడు. రియలైజ్‌ అయ్యాడని చెప్పుకోవడం కన్నా.. తన కుటుంబానికి జరిగిన అన్యాయం.. మరొకరికి జరగొద్దన్న ఆలోచన అతని ఆవేదనలో ఉంది. అసలు జరిగిన వాస్తవమేంటో ప్రపంచానికి చెప్పాలన్న తాపత్రయం కనిపిస్తోంది. జరిగిన ఘోరమేంటో, ఆ ఘోరం గురించి చెప్పుకుంటే చూపించిన పోలీసుల అలసత్వమేంటో, ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటో, బాధితులనే నిందితులుగా మార్చేయాల్సి వస్తుందంటూ భయపెట్టిన తీరు ఏంటో, చివరకు చట్టం మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా, చట్టాన్ని ఎంతలా గౌరవించినా.. న్యాయం జరగదన్న క్లారిటీ వచ్చిన తర్వాతే తాను ప్రొసీడ్‌ అయ్యానని వివరంగా చెప్పిన వీడియో ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేస్తోంది. బుధవారం తన వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు నిందితుడు ఆంజనేయప్రసాద్‌.

హత్య చేసిందిలా…

హత్యకు గురైన వృద్ధుడు, హత్య చేశానని చెబుతున్న నిందితుడు.. ఇద్దరూ కొత్త మంగంపేటకు చెందిన వాళ్లే. చనిపోయింది గుట్ట ఆంజనేయులు. తానే చంపేశానని చెబుతున్న వ్యక్తి ఆంజనేయ ప్రసాద్‌. కువైట్‌లో ఉంటున్న ఆంజనేయ ప్రసాద్‌.. గత శుక్రవారం రాత్రి కువైట్‌నుంచి విమానంలో వచ్చాడు. రాత్రయ్యాక నేరుగా కొత్త మంగంపేట గ్రామానికి చేరుకున్నాడు. ఆంజనేయులు ఇంటికెళ్లాడు. గాఢనిద్రలో ఉన్న ఆంజనేయులు తలపై ఇనుపరాడ్డుతో చావుదెబ్బ కొట్టాడు. ఒకే ఒక్క దెబ్బకు ఆంజనేయులు చనిపోయాడని నిర్థారించుకున్నాక.. అక్కడినుంచి ఆంజనేయ ప్రసాద్‌ పరారయ్యాడు. మళ్లీ నేరుగా విమానాశ్రయానికి వెళ్లాడు. నెక్ట్స్‌ ఫ్లైట్‌కు తిరిగి కువైట్‌ వెళ్లిపోయాడు.

అసలేం జరిగింది?

అన్నమయ్య జిల్లా కొత్తమంగంపేటకు చెందిన ఆంజనేయప్రసాద్‌, చంద్రకళ దంపతులు ఉపాధికోసం కువైట్‌ వెళ్లి కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్నారు. పన్నెండేళ్ల వయసున్న వాళ్ల కూతురును చంద్రకళ సోదరి లక్ష్మి ఇంట్లో ఉంచారు. అయితే, కొద్దిరోజుల క్రితం లక్ష్మి మామయ్య గుట్ట ఆంజనేయులు చంద్రకళ కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వరుసకు మనవరాలు అయ్యే బాలిక పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. దీంతో, తాతయ్య తన పట్ల ప్రవర్తించిన విషయం బాలిక.. తన చిన్నమ్మ లక్ష్మికి చెప్పింది. అయితే, ఈ విషయంపై ఆంజనేయులును కనీసం ప్రశ్నించకుండా.. లక్ష్మి, ఆమె భర్త వెంకటరమణ.. బాధిత బాలికనే బెదిరించారు. తాతయ్య తనపై అఘాయిత్యానికి ప్రయత్నించిన విషయం ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాకుండా.. కువైట్‌లో ఉన్న తన సోదరి చంద్రకళకు లక్ష్మి ఫోన్‌ చేసి.. వాళ్ల కూతురిని తీసుకెళ్లాలని, తమ ఇంట్లో పెంచలేమని చెప్పింది. దీంతో, చంద్రకళ సొంతూరికి వచ్చి.. కూతురిని తనవెంట కువైట్‌కు తీసుకెళ్లింది. కువైట్‌కు వెళ్లిన తర్వాత అసలేమైందని అనుమానం వచ్చిన చంద్రకళ.. ఏం జరిగిందంటూ కూతురిని మరీ మరీ అడిగింది. దీంతో, తాతయ్య ఆంజనేయులు తనపట్ల వ్యవహరించిన తీరు చెబుతూ భయాందోళనకు గురయ్యింది. కూతురు భయపడుతుండటం, ఆంజనేయులు ఎంతగా తమ కూతురిని ఇబ్బంది పెట్టాడో అర్థం చేసుకున్న ఆంజనేయ ప్రసాద్‌.. వెంటనే తన కూతురిని, భార్యను కొత్తమంగంపేటకు పంపించి పోలీసులకు ఫిర్యాదు ఇప్పించాడు. అయితే, పోలీసులు మాత్రం ఈ కేసును పెద్దగా పట్టించుకోకుండా.. నిందితులను పిలిచి మందలించి వదిలేశారు. ఆ తర్వాత లక్ష్మి, వెంకటరమణ దంపతులు చంద్రకళ దంపతులపై కక్ష పెంచుకున్నారు. తమనే పోలీసులకు పట్టిస్తారా? అంటూ బంధువులందరికీ జరిగిన విషయం చెప్పారు. అంతేకాదు.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాము పోలీసులకు డబ్బులిచ్చి బయటకు వచ్చామని చాటింపు వేశారు. ఈ పరిణామంతో చంద్రకళ మరింత ఆవేదనకు గురయ్యింది. తమ పరువు తీస్తున్నారని, పోలీసులకు డబ్బులిచ్చామంటున్నారని మరోసారి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు ఫోన్‌లోనే నిందితులను మందలించడంతో లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో, పోలీసులు కువైట్‌కు వెళ్లాల్సిన చంద్రకళను వెళ్లనీయకుండా.. లక్ష్మికి ఏమైనా జరిగితే రివర్స్‌ కేసు పెడతామని బెదిరించారు. న్యాయంకోసం పోలీసుల దగ్గరికి వస్తే.. తననే కేసులో ఇరికిస్తారేమోనని భయపడిన చంద్రకళ కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలిసిన ఆంజనేయ ప్రసాద్‌ సొంతూరికి వచ్చి భార్యకు చికిత్స చేయించాడు. అంతా సర్దుకున్నాక కువైట్‌ తిరిగి వెళ్లిపోయారు.

నిరంతరం వెంటాడిన అన్యాయం :

ఆంజనేయప్రసాద్‌.. తన భార్య, కూతురిని తీసుకొని కువైట్‌కు తిరిగి వెళ్లినప్పటికీ తన కూతురికి జరిగిన అన్యాయం, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే జరిగిన అనుభవాలు అతన్ని కుదురుగా నిలవనీయలేదు. తన కూతురిలాగే మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదనుకున్నాడు. పోలీసులను నమ్ముకుంటే తనకు న్యాయం జరిగే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చాడు. అందుకే తానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని డిసైడయ్యాడు. ఆలోచన వచ్చిందే తడవుగా.. ఇంట్లో కూడా చెప్పలేదు. ఎడారిలో స్పెషల్‌ డ్యూటీకి వెళ్తున్నానని భార్య, కూతురికి చెప్పాడు. తాను పనిచేసే చోట నాలుగు రోజులు అత్యవసర సెలవు పెట్టుకున్నాడు. అంతే.. నేరుగా భారత్‌కు వచ్చి.. తమ సొంతూరికి వెళ్లి.. తన కూతురి పట్ల పశువులా ప్రవర్తించిన వాడిని హత్యచేసి తిరిగి కువైట్‌ పారిపోయాడు. ఈ విషయం రెండో వ్యక్తికి కూడా తెలియకుండా చూసుకున్నాడు. కానీ, తిరిగెళ్లాక ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. అలా చేస్తేనే తనకూతురికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా ఉంటుందనుకున్నాడు. అంతేకాదు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమకు ఎదురైన అనుభవాలేంటో కూడా అందరికీ చెప్పాలనుకున్నాడు. అందుకే వివరంగా వీడియో రికార్డ్‌ చేసి షేర్‌ చేశాడు.

అధికార వ్యవస్థకు, పాలనా యంత్రాంగానికి సవాల్‌ :

ఆంజనేయ ప్రసాద్‌ విడుదల చేసిన సుదీర్ఘ వీడియోలో చాలా అంశాలు ప్రస్తావించాడు. అతను ప్రస్తావించిన అంశాలు తనను తాను సమర్థించుకోవడానికి చెప్పినవే అయినా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వ్యవస్థను, పాలనా యంత్రాంగాన్ని నిలదీస్తున్న ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి. పోలీసులు సరైన విధంగా స్పందిస్తే, అనుమానాలకు చోటు లేకుండా వ్యవహరిస్తే.. కువైట్‌కు ఉపాధికోసం వెళ్లిన ఆంజనేయప్రసాద్‌.. అంతదూరం నుంచి వచ్చి ఓ వ్యక్తిని హత్య చేయాల్సిన అవసరం వస్తుందా? అన్న సందేహం వెంటాడుతోంది. రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రికి కూడా ఈ విషయం తెలియాలనుకున్న అతని ఆకాంక్ష.. పాలనావ్యవస్థ గాడి తప్పుతుందా? అన్న సంకేతాలకు ఊతమిస్తోంది. ఇప్పుడు ఆంజనేయ ప్రసాద్‌.. తనకు తానుగా బయటకు చెబితే తప్ప ఎవరికీ తెలియలేదు. మరి.. ఇలాగే బయటకు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్న బాధితులు, బాధిత కుటుంబాలు ఇంకా ఎన్ని ఉండొచ్చ? అన్న ప్రశ్నలు అందరి మదినీ తొలిచేస్తున్నాయి. మరి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఏం చేస్తారు? ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై స్పందిస్తుందా? వేచిచూడాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com