తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొన్నటి వరకూ కాంగ్రెస్ ను, సోనియాను తెగ తిట్టి పోసిన బీఆర్ ఎస్ తన పోరాట పంథాను మార్చుకుందా? తెలంగాణ సెంటిమెంట్ తో , ఆత్మ గౌరవ నినాదంతో తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన బీఆర్ ఎస్ పార్టీ పదేళ్ల పాలన తర్వాత ప్రజల ఆగ్రహావేశాలకు తలొగ్గి ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే కేటీఆర్ లో ఫైర్ మాత్రం తగ్గలేదు. మరోవైపు అధ్యక్షుడు కేసీఆర్ అసలు ప్రత్యక్షరాజకీయాల్లో ఉన్నారా లేరా?అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతల తీరును తప్పుబడుతూ కేటీఆర్ మాత్రం ప్రజాక్షేత్రంలో బాగా బిజీగా కనిపిస్తున్నారు. ప్రజలతో మసక బారిన తమ సంబంధాలను మళ్లీ రివైవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలోనూ గట్టిగానే ఫైర్ అవుతున్నారు.. అయితే మొత్తంగా బీఆర్ ఎస్ టోన్ లో మాత్రం ఎక్కడో చిన్న మార్పు కనిపిస్తోంది. అసలు ప్రతిపక్షాలను కలవడమే తన డిక్షనరీలో లేదన్న రీతిలో వ్యవహరించిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానాన్నిస్వయంగా అందుకోవడం ఆయనలోవచ్చిన కొత్తమార్పు.అసలు మామూలుగా అయితే ఇలాంటి వాటికి కేసీఆర్ దూరం. అసలీమధ్య కేసీఆర్ మీడియా ముందుకు రావడమే మానేశారు. అంతరంగికులతో సమావేశాలకే అదీ తనకు ఇష్టమొచ్చినప్పుడే దర్శన మిస్తున్నారు. మిగతా టైమ్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నట్లు సమాచారం. అసలు రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మరిచిపోయారా? వదిలిపెట్టేయాలనుకున్నారా? లేక మళ్లీ ఎన్నికల నాటికి ఫుల్ ఛార్జింగ్ తో బయటకు వస్తారా అన్నది తెలీటం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, తమ తప్పులు ఎత్తి చూపాలని కోరారు. అయినా ఆయన తీరు మారలేదు. కుంటు పడిన బీఆర్ ఎస్ చరిష్మానుమళ్లీ తిరిగి తెచ్చేందుకు కేటీఆరే కష్టపడుతున్నారు.
మొన్నటి దాకా కాంగ్రెస్ వారిని ఏక బిగిన తిట్టి పోసిన కేటీఆర్ ఈ మధ్య వర్కింగ్ స్టైల్ మార్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ కి లేఖ రాయడం చూస్తుంటే బీఆర్ ఎస్ పార్టీ స్లోగా తమ వర్కింగ్ స్టైల్ మార్చుకుంటోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అరుపులు, కేకలు, నినాదాలు, ప్రదర్శనలను పక్కన పెట్టి ఇప్పుడు లేఖాస్త్రాలను సంధించే మోడ్ లోకి ఎందుకు మారినట్లు? అన్ని వేళలా ఒకే పంథా పోరు కలసి రాదనుకున్నారా? తెలంగాణ అస్తిత్వానికి తామే అసలైన కారకులమని చెప్పిన బీఆర్ఎస్ ప్రజలు ఆ భావన నుంచి బయటపడి చాలాకాలమైందన్న విషయం తెలుసుకుందా?
తెలంగాణతల్లి ఎంత పని చేసింది…
మొత్తం మీద కేటీఆర్ నాలుగు పేజీల లేఖ ఆయన ఓరల్ లాంగ్వేజ్ కి స్క్రిప్ట్ మాత్రమే.. ఆయన మాటల తీవ్రత,దూకుడు, స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. కేటీఆర్ లేఖకి కాంగ్రెస్ కూడా అంతే స్పీడ్ లో రిటార్ట్ ఇచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు కేటీఆర్, కేసీఆర్ లపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అంతకి నాలుగింతలు తిట్టి పోశారు. ఇంతకీ ఈ మార్పుకి నాంది పలికింది మాత్రం తెలంగాణ తల్లే. కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహ మార్పిడిపై నిప్పులు కక్కారు. ఆ సందర్శంగానే కాంగ్రెస్ పనితీరును రాహుల్ కి రాసిన లేఖలో తూర్పారబట్టారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకూ అన్ని విగ్రహాలను గాంధీ భవన్ కు పార్శిల్ చేసి పంపిస్తామన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ స్టైల్ ఇలా ఉంటే.. కాంగ్రెస్ నేతల ఉనికినే భరించలేని కేసీఆర్ వారి ఆహ్వాన పత్రాన్ని స్వయంగా అందుకోవడం విచిత్రం. ఈ రెంటికీ కారణం తెలంగాణ తల్లే…