34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఉక్రెయిన్ కథ కంచికేనా.. రష్యాకు అనుకూలంగా ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చాలా కాలంగా ఓ మాట చెబుతున్నారు. ఎప్పటికైనా రష్యా ఓటమి చూడాల్సిందే అని. అంతేకాదు తాము రష్యాను ఇలా దెబ్బతీశాం.. అలా దెబ్బతీశాం అంటూ వరుసగా పోస్ట్‌లు పెట్టేవారు, స్టేట్‌మెంట్లు ఇచ్చేవారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంటూనే ఉంది. ఉక్రెయిన్‌ చేసిన ఒకటో రెండో దాడులను సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తూ మేం పైచేయి సాధిస్తున్నామని చెబుతున్నా.. దానికి మించిన నష్టాన్ని చవిచూస్తోంద ఉక్రెయిన్. ఈ యుద్ధం ఎలాగైనా ఆగకూడదన్న ఉద్దేశంతోనే బిలియన్ల కొద్ది డాలర్ల ఆయుధ సాయాన్ని వెళుతూ వెళుతూ జో బైడెన్‌ ఉక్రెయిన్‌కు అందిస్తూ వెళ్లారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత సీన్ మారిపోయింది. బైడెన్ ఇచ్చిన ఆదేశాలను ఆపేశారు. నిజానికి ఈ యుద్ధం జరగడం ట్రంప్‌కు మొదటి నుంచి ఏ మాత్రం ఇష్టం లేదు. ఉక్రెయిన్ కోసం అమెరికా ఎందుకంత ఖర్చును భరించాలన్నది ట్రంప్ ఉద్దేశం.

కొత్త గేమ్ స్టార్ట్ చేసిన జెలెన్ స్కీ..

ట్రంప్ అధికారంలోకి రాగానే యుద్ధానికి బ్రేక్‌లు పడటం ప్రారంభమైందనే చెప్పాలి. ఉక్రెయిన్‌తో సంప్రదించకుండానే రష్యాతో చర్చలు జరపాలని స్టేట్‌మెంట్ ఇచ్చారు ట్రంప్. అంతేకాదు రష్యాకు కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించడం ఇష్టం లేదన్నారు. అయితే జెలెన్‌ స్కీ మాత్రం ఇందులోకి యూరోపియన్ యూనియన్‌ను లాగేందుకు ప్రయత్నించారు. ఈయూ దేశాల ప్రతినిధులు లేకుండా చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. కానీ కొన్ని రోజులు తర్వాత ఆ స్వరంలో తీవ్రత తగ్గింది. ఉక్రెయిన్ ఆక్రమించుకున్న స్థలాలు రష్యాకు ఇచ్చేస్తాం.. రష్యా ఆక్రమించుకున్న స్థలాలు ఉక్రెయిన్‌కు అప్పగించాలన్నారు. కానీ విశేషం ఏంటంటే.. ఉక్రెయిన్‌, అమెరికా రోజుకో స్టేట్‌మెంట్ ఇస్తున్నా రష్యా ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉంది.

పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్.. ఇదో టర్నింగ్ పాయింట్..

నిజానికి ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ సింపుల్. ఉక్రెయిన్‌ నాటోలో చేరేందుకు సిద్ధమవడం. ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే అది తమకు ప్రమాదకరమని భావించింది రష్యా. ఎందుకంటే నాటోలో చేరిన వెంటనే రష్యా సరిహద్దుల్లోకి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఏర్పాటవుతుంది. అది తమ దేశ అస్థిత్వానికే ప్రమాదమని భావించింది రష్యా. చూస్తూ ఊరుకుంటే లాభం లేదని చెప్పి.. దాడులు ప్రారంభించింది. ఇది గతం. అయితే ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ నిజంగానే గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. శాంతి చర్చలు జరపాలని ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ కాల్‌లో ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదని పుతిన్‌ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఫోన్ కాల్‌ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. నాటోలో ఉక్రెయిన్ చేరడం ప్రాక్టికల్‌గా కష్టమన్నారు. దీంతో జెలెన్‌ స్కీ ఆశలన్ని అడియాశలైనట్టే అని చెప్పాలి.

సౌదీలో ట్రంప్, పుతిన్ భేటీ!

ట్రంప్, పుతిన్‌ త్వరలో భేటీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ భేటీకి సౌది అరేబియా వేదిక కానుందని తెలుస్తోంది. అయితే ఇరు దేశాల నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ భేటీలో సౌదీ యువరాజు కూడా ఉంటారని సమాచారం. అయితే ఈ ఫోన్‌ కాల్‌ను రష్యా కూడా ధ్రువీకరించింది. ట్రంప్‌ను రష్యాలో పర్యటించాలని పుతిన్‌ ఆహ్వానించారని తెలిపింది.

ఇప్పటికే ట్రంప్ ఓ బాంబు లాంటి వార్తను ప్రపంచానికి చెప్పారు. రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్‌ ప్రాంతాలను తిరిగి పొందే అవకాశం లేదని. ఇది జెలన్‌ స్కీకి మరో షాక్. ఇంత జరుగుతున్నా ఇప్పటికి తనదే పైచేయి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు జెలెన్ స్కీ. పుతిన్, రష్యాను కంట్రోల్ చేయడానికి అమెరికా సరిపోతుందంటూ మరో స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. మొత్తంగా చూస్తే.. కింద పడ్డ తనదే పైచేయి అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహరం.

నిజానికి ఈ యుద్ధం ప్రారంభించింది పేరుకు రష్యానే అయినా.. దానికి కారణం మాత్రం బైడెన్, జెలెన్ స్కీ అనే చెప్పాలి. అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్‌, రష్యాలను అగాధంలోకి తోసింది వీరి నిర్ణయాలే. ఈ నిర్ణయాల వల్లే అమెరికా ఖాజానపై ఎఫెక్ట్ పడింది. లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉక్రెయిన్, రష్యాకు చెందిన వేలాది మంది సైనికులు అమరులయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com