37.4 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

సిడ్నీ టెస్టే చివరిదా?

రోహిత్ శర్మ.. 50 ఓవర్ల వరల్డ్ కప్‌లో ఫైనల్స్ వరకు తీసుకొచ్చిన కెప్టెన్.. టీ20 వరల్డ్‌కప్‌ను అందించిన కెప్టెన్.. ఇదంతా ఎంత నిజమో.. టెస్టుల్లో టీమ్ ఇండియా పరువును ఆకాశం నుంచి భూమి మీదకు తీసుకొచ్చిన కెప్టెన్ అనేది కూడా అంతే నిజం. అందుకే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌ ఎప్పుడూ అని. వాళ్లు సాగనంపకముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. ఇప్పటికే దిగ్గజాలు కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందంటూ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీనికి కారణం కూడా ఉంది. కెప్టెన్‌గానే కాదు.. కొద్ది కాలంగా టెస్ట్‌ల్లో అస్సలు రాణించడం లేదు రోహిత్. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా లేదు. అందుకే ఇప్పుడు రోహిత్‌ శర్మపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.

అయితే ఇప్పుడో ప్రచారం తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే రోహిత్ శర్మ ఆడే చివరిగా ఆడే మ్యాచ్ సిడ్నీ టెస్టే అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిడ్నీ టెస్ట్‌లో గెలిచినా.. ఓడినా కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగియగానే తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రోహిత్ సెలెక్టర్లతో చర్చించినట్టు కూడా నేషనల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. నిజానికి ఎప్పుడైతే సొంత గడ్డపై కివీస్ చేతిలో ఓటమితో పాటు వైట్‌ వాష్‌ అవ్వడం టీమిండియా పరువును మూసీ నదిలో కలిపేసినట్టైంది. ఇంట గెలవలేదు.. ఇక రచ్చనైనా నెగ్గి పరువు కాపాడుతారనుకుంటే పెర్త్ టెస్ట్‌లో తప్ప వరుస ఓటములు, డ్రా మ్యాచ్‌లే. పెర్త్‌ టెస్ట్‌లో కూడా బుమ్రా కెప్టెన్సీ నిర్వహించాడు. ఇక రోహిత్ శర్మ రీ ఎంట్రీ తర్వాత టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. గబ్బా టెస్ట్‌లో కూడా వరణుడు కరుణించాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ టెస్ట్‌ కూడా ఆసీస్‌ లిస్ట్‌లో పడేది. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో 2-1 తేడాతో లీడ్‌లో ఉంది ఆస్ట్రేలియా.

అయితే సిడ్నీ టెస్ట్‌ రోహిత్ శర్మ ఫ్యూచర్‌ను డిసైడ్ చేయనుంది అనేది వాస్తవం. ఎందుకంటే సిడ్నీ టెస్ట్‌లో విజయం సాధించి.. టీమిండియా WTC ఫైనల్స్‌కు చేరితే పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే WTC ఫైనల్స్‌కు టీమిండియా చేరితే సెలెక్టర్లు అతడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. రోహిత్ కూడా చివరిగా వెళ్లేప్పుడు గర్వంగా వీడ్కోలు పలికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రోహిత్ అస్త్రసన్యాసం చేస్తే అది అవమానంతోనే అవుతుందనేది నిజం. అందుకే రోహిత్ కూడా దీనిపై ఆలోచించే అవకాశం ఉంది.

టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి మ్యాచ్‌లకు అల్విదా పలికేశాడు. అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు టెస్ట్‌ల్లో కూడా అలానే చేస్తే బాగుంటుందనేది నిజం. ఎందుకంటే టీమిండియాకు రోహిత్ శర్మ చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి ప్లేయర్ ఇలా ఆటను వదిలిపెట్టడం అనేది క్రికెట్ అభిమానులకు డైజెస్ట్ కానీ అంశం. ఎందుకంటే ఫ్యాన్స్‌ ఆగ్రహావేశాలపై నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే సిడ్నీ టెస్ట్‌లో భారీ తేడాతో గెలిస్తే ఇదే ఫ్యాన్స్‌ మళ్లీ రోహిత్‌ను నెత్తినపెట్టుకుంటారు.. అవసరమైతే పాలాభిషేకాలు చేస్తారు. ఇదంతా జరగాలంటే సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించాలి. మరి అది అయ్యే పనేనా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com