25.2 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

కాళేశ్వరం కథ ముగిసినట్లేనా?

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణలో గర్వంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు మసకబారి పోతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదిక కాళేశ్వరం పరిస్థితిపై మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కలల ప్రాజెక్టుగా ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా కొత్తగా లక్ష ఎకరాల సాగునీరు అందుబాటులోకి వచ్చిందని అధికార పార్టీ ప్రచారం చేసింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలంగా మార్చామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అప్పటి మంత్రులు కూడా చెప్పుకున్నారు.

అయితే, నిర్మాణం పూర్తయ్యిన మూడేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం లోపాలు వెలుగులోకి వచ్చాయి. లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు ఏర్పడిన విషయంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తీవ్ర ప్రతికూలత ఎదురైంది. కాళేశ్వరం నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు ఆ పార్టీ ఓటమికి ఓ కారణంగా మారినట్లు విశ్లేషకులు కూడా అంచనా వేశారు.

తాజాగా NDSA సమర్పించిన నివేదిక ప్రకారం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పనికిరాని స్థితిలో ఉన్నాయని తేలింది. ఈ బ్యారేజీలు ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. 14 నెలల పాటు సాగిన అధ్యయనం తర్వాత సిద్ధమైన ఈ నివేదిక ప్రకారం, బ్యారేజీల డిజైన్, నిర్మాణాల్లో తీవ్ర లోపాలున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీకెంట్ పైల్స్ కూలిపోవడం, బ్యారేజీల ఎగువ, దిగువ ప్రాంతాల్లో రంధ్రాలు ఏర్పడటం వంటి కీలక లోపాలను గుర్తించారు.

ఈ బ్యారేజీలను యథావిధిగా ఉపయోగించడం సురక్షితమయ్యే అవకాశం లేదని, పూర్తిగా రీడిజైన్ చేసి మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. నిర్మాణానికి ముందు నిర్వహించాల్సిన భూసార పరీక్షలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, సిఫారసు చేసిన స్థలాల నుంచి ఇతర ప్రాంతాలకు బ్యారేజీలను మార్చడం వల్ల నిర్మాణ స్థిరత్వం దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం వర్షాకాలం ముందు బ్యారేజీల భద్రతా తనిఖీలు చేయాల్సిన నిబంధనను పాటించకుండా ఉల్లంఘించారని ఆ నివేదిక వెల్లడించింది.

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఈ నివేదిక కీలక ఆధారంగా మారనుంది. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన నేతలు కేసీఆర్, హరీశ్ రావు లాంటి వారు కమిషన్‌ ముందు ప్రశ్నల ధాటిఇ ఎదుర్కొవాల్సిన అవకాశముంది. రాజకీయంగా ఈ నివేదిక బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బగా మారబోతోంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లోపాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని బీఆర్‌ఎస్‌పై దాడిని ముమ్మరం చేయబోతోంది.

కాళేశ్వరం బ్యారేజీలు సాగునీటిని అందించడంలో కీలక పాత్ర పోషించాలని భావించిన రైతులకు ఇప్పుడు నిరాశ తప్పడం లేదు. బ్యారేజీలు పనికిరాక పోవడం వల్ల సాగునీటి కల నెరవేరే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇప్పుడు బ్యారేజీల రీడిజైన్, పునర్నిర్మాణ పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కావడం వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా కూడా భారంగా మారనుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతోంది.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com