38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

పవన్ కల్యాణ్‌పై కాపు సామాజిక వర్గం ఆగ్రహం?

ఆంధ్ర ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు కాపు సామాజికవర్గంలో కలకలం రేపుతున్నాయి. తరచూ ఆయన చేసే వ్యాఖ్యలు, స్వయంగా తనకు మాత్రమే కాకుండా, కాపు సమాజాన్ని కూడా చిన్నచూపు చూస్తున్నట్లుగా ఉందని ఆ సామాజిక వర్గనికి చెందిన వాళ్లు మండి పడుతున్నారు.

ఉగాది సందర్భంగా అమరావతిలో నిర్వహించిన పీ-4 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “సత్తా లేకుంటే సత్తా ఉన్న నేతకు మద్దతు ఇవ్వాలి” అంటూ చంద్రబాబును ప్రశంసించిన పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలు తమ ఆవేదనకు కారణమవుతున్నాయని, ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజికవర్గం ఓటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఈ సామాజికవర్గం బలమైన ప్రభావం కలిగి ఉంది. ముఖ్యమంత్రి పదవిపై కాపు సామాజికవర్గానికి చెందిన నేతను కూర్చోబెట్టాలన్న ఆశ చాలా కాలంగా ఉంది. అయితే, టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ, వైసీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గాలు మాత్రమే అధికారం పొందుతున్నాయని కాపు సామాజిక వర్గం నేతల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. జనసేన పార్టీని తమ స్వంత పార్టీగా భావించిన వాళ్లు, పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలపై నైరాశ్యంలో మునిగి పోతున్నారు.

“సత్తా లేదని ఒప్పుకోవడమంటే రాజకీయంగా వెనుకబాటుకు గురికావడం కాదా?” అని కొందరు సోషల్ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజారాజ్యం పార్టీలో అంతగా ప్రగతి లేక పోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన నిర్ణయాన్ని అప్పట్లో కొందరు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే మార్గంలో పవన్ కల్యాణ్ కూడా తన పార్టీని అభాసుపాలు చేస్తున్నారని, పార్టీ అధినేతగా బలహీనత చూపిస్తున్నారని సోషల్‌ మీడియాలో ఆరోపణలు చుట్టుముడుతున్నాయి.

పార్టీని స్థాపించి ప్రజల కోసం పోరాడాల్సిన నాయకుడు, ఇలా ఇతర నేతలను ప్రశంసించడం రాజకీయంగా తప్పు అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్నాయి. మిత్రపక్షం కాబట్టి ఒకసారి ప్రశంసించడం వేరు, కానీ.. ప్రతి అవకాశంలో పొగడ్తల వర్షం కురిపించడం అనేది కార్యకర్తలను నిరుత్సాహపరుస్తుందని, పార్టీపై నమ్మకం కోల్పోవడానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మీకు సత్తా లేకపోతే పార్టీ ఎందుకు పెట్టారు? పోటీ ఎందుకు చేశారు? అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినేతగా ఉండి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీరని నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని సొంత పార్టీ నేతలతో పాటు.. కాపు సామాజిక వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com