29 C
Hyderabad
Saturday, June 13, 2026

Live Video

spot_img

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కీలక అప్‌డేట్‌

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ముందడుగు పడుతోంది. ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే వారం రోజుల్లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల కానుంది.

మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో కారిడార్ 1ఏ, 1బీ నిర్మాణాలను చేపట్టనున్నారు. కారిడార్ 1ఏ కింద గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1బీ కింద పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 38.40 కి.మీ దూరం మేరకు నిర్మాణం జరగనుంది. ఈ దశలో రూ.11,009 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భూసేకరణపై మాత్రమే రూ.1,152 కోట్ల వ్యయం ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

భూసేకరణ కోసం మొత్తం 82.66 ఎకరాల భూమి అవసరం. ఇందులో కృష్ణా జిల్లాలో 70.95 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 11.71 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇందులో 1.03 ఎకరాలు రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవి. 4.86 ఎకరాలు ఏపీ ప్రభుత్వానికి చెందినవి. మిగతా 76.77 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుండి సేకరించాల్సి ఉంటుంది.

ఇంకా, రామవరప్పాడు చౌరస్తా నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారి మీదుగా మెట్రో లైన్ ఏర్పాటవుతుంది. ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా, ఒకదానిపై మరొకటి డబుల్ లైన్‌లో మెట్రో నిర్మాణం చేయనున్నారు. ఈ ప్రణాళికను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మెట్రో అధికారులు కలిసి రూపొందిస్తున్నారు.

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులను ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) మోడల్‌లో పూర్తి చేయాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రాజెక్టు డిజైన్ల తయారీ కోసం గుజరాత్, చెన్నై మెట్రో ప్రాజెక్టుల్లో అనుభవం కలిగిన రిటైర్డ్ ఆఫీసర్ల సేవలను వినియోగించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, విజయవాడ నగరంలోని ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం లభించనుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com