25.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

కేటీఆర్‌కు, మూడు హత్యలతో లింకుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. మీడియా ప్రతినిధులతో చేసిన చిట్‌చాట్‌లో కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయని, రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్టిలో చెప్పారు. వారిలో ఒకరు మేడిగడ్డపై కేసులు వేసిన రాజలింగమూర్తి, రెండు సినీ నిర్మాత కేదార్, మూడు వీరిద్దరి కేసులను వాదిస్తున్న సంజీవరెడ్డి అనే లాయర్ అని చెప్పారు. సినీ నిర్మాత కేదార్.. కేటీఆర్‌కు బిజినెస్ పార్టనర్ అని రేవంత్‌ చెప్పారు. ఈ మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.

కేదార్ అనే సినీ నిర్మాత విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో గం గం గణేశా అనే సినిమా నిర్మించారు. విజయ్ దేవరకొండతో మరో సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ఒక సినీ పైనాన్షియర్ ఇంట్లో పెళ్లి వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన కేదార్‌.. అక్కడ చనిపోయారు. ఆయన మరణం వెనుక అసలేం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దుబాయ్‌లో కేదార్‌తో పాటు బీఆర్ఎస్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారని బాంబు పేల్చారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అక్కడ ఎందుకు ఉన్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

డ్రగ్స్ కేసులు త్వరలో విచారణకు వస్తున్న సమయంలో ఇలాంటి మరణాలు అనుమానాస్పదంగానే ఉన్నాయని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. తన వ్యాపార భాగస్వామి మరణంపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. వీటిపై విచారణకు కేటీఆర్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే తాము విచారణ చేయిస్తామన్నారు.

ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆలస్యం చేస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న వారిని తీసుకు రావాల్సింది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును స్వదేశానికి తీసుకు వస్తే.. తాము నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కూడా అరెస్టు చేస్తామన్నారు.

కాళేశ్వరంపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతోందని, వారి విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపఎన్నికలు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ అంటున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే, ఎలా వస్తాయని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలను ఫిరాయించినా రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేనే లేదని స్పష్టం చేశారు. ఈ ముగ్గురు మృతిచెందడంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వం తప్పకుండా విచారణ సాగిస్తుందని సీఎం రేవంత్‌ అన్నారు.

గతంలో కేటీఆర్‌కు వ్యాపార భాగస్వామిగా ఉన్న కేదార్‌కు డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. అయితే, కేదార్‌ అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడంతోనే మృతి చెందినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కేదార్ మృతిచెందినప్పుడు పక్కనే ఓ తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దుబాయిలో కేదార్ మరణం వెనుక ఓ పెద్ద మిస్టరీనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ రాజకీయ ప్రముఖుడు ఇచ్చిన డ్రగ్స్ పార్టీ రాడిసన్ హోటల్‌లో జరిగిందని.. అందులో కేదార్ కూడా ఉన్నాడని సీఎం చెప్పారు. ప్రధాన కేసుల్లో ఉన్న వారు ఇలా వరుసగా మృతిచెందడం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ జరిపిస్తాం… అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు, టాలీవుడ్‌లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని గతంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు కేదార్ మృతి చెందడం, అది కూడా దుబాయిలో సంఘటన జరగడం.. ఈ మరణాల వెనుక అసలు కారణాలేంటన్న పెద్ద చర్చే జరుగుతోంది.

మరోవైపు.. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ రాజకీయాల కోసం మాట్లాడుతోందని.. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తెలంగాణలో పోటీ జరుగుతోందన్నారు రేవంత్‌ రెడ్డి. బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేస్తోందన్నారు. ప్రధానమంత్రితో జరిగిన భేటీలో రాష్ట్రానికి రావాల్సిన, కావాల్సిన అంశాలపై నివేదికలు ఇచ్చామన్నారు. ఎస్ఎల్‌బీసీ పనులు కమిషన్లు రావన్న కారణంగా పదేళ్ల పాటు నిలిపివేశారని రేవంత్ మండిపడ్డారు. ఈ కారణంగానే ఆ ప్రమాదం జరిగిందన్నారు. కార్మికులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధాని మోదీకి వివరించానని రేవంత్ రెడ్డి తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com