- రాజ్యసభలో కాంగ్రెస్ ను ఏకిపారేసిన ప్రధాని
- వారి తాపత్రయంఅంతా ఒక కుటుంబం కోసమే
- సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. మీకేం తెలుసు?
- ఎమర్జెన్సీ టైమ్ లో నియంతృత్వం పతాక స్థాయికి
- నెహ్రూ పాలన అంతకన్నాఘోరం
- అంబేద్కర్ అంటే వారికి గిట్టదు
- డిపోర్టీల అమానవీయ తరలింపుపై చర్చ సందర్బంగా విమర్శలు
అందరి అభివృద్ధిని, మంచిని కాంక్షించడం కాంగ్రెస్ కు అసలు రానే రాదని ప్రధాని మోడీ విమర్శించారు. అక్రమ వలసదారులను వెనక్కు పంపడంలో అమెరికా అనుసరించిన అమానవీయ విధానంపై ప్రతిపక్షాలు మోడీని రాజ్యసభలో దుమ్మెత్తిపోశాయి. దానికి స్పందించిన ప్రధాని కాంగ్రెస్ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే సిద్ధాంతాన్నే అసలు నమ్మదని, తెలిసిందల్లా బుజ్జగింపు రాజకీయాలొక్కటేనని దెప్పి పొడిచారు.
ఎమర్జెన్సీ దారుణాలు ఎన్నెన్నో…
భావ ప్రకటనా స్వేచ్ఛను ఉక్కు పాదంతో అణచివేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ దేనంటూ పరోక్షంగా మాజీ ప్రధాని ఇందిర విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి సర్వతో ముఖాభివృద్ధిని, సకలజన సంక్షేమాన్ని కాంక్షించడం అంత బుద్ధి తక్కువ పని మరోటి లేదన్నారు. అది వారి ఆలోచనల పరిధిలోది కాదని అన్నారు. అది వారి రోడ్ మ్యాప్ కు కూడా సూట్ కాదు ఎందుకంటే వారియావ అంతా ఎప్పుడూ ఒక కుటుంబం గురించే అని తిప్పికొట్టారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో విపక్షాల విమర్శలకు సమాధానంగా మోడీ స్పందించారు.
వారికి కుటుంబమే ముందు…
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వారి మొదటి ప్రాధాన్యత ఆ ఒక్క కుటుంబమే. ప్రతీదీ బుజ్జగింపు, ఊరడింపు రాజకీయమే. అదీ వారి రాజకీయపు తీరు అని మోడీ వ్యాఖ్యానించారు. కానీ 2014 తర్వాత దేశ రాజకీయాల్లో పెనుమార్పులొచ్చాయని బీజేపి అధికారంలోకి వచ్చాక పాలన కొత్త పుంతలు తొక్కిందని.. బుజ్జగింపు కాదు, ప్రజలను సంతుష్టులను చేసే పాలన సాగించామన్నారు. ప్రజలకు మా విధానం బాగా నచ్చింది. జాతి ప్రయోజనాలే ముందు అన్నది మా విధానం. అందుకే ప్రజలు మమ్మల్ని మూడు సార్లు గెలిపించారు అన్నారు మోడీ. మా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు, మహిళలు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని ప్రధాని అన్నారు. దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ అంటే కాంగ్రెస్ కు అస్సలు గిట్టదని, అందుకే ఆయన్ను ఓడించిందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అంబేద్కర్ అంటే కాంగ్రెస్ కు అస్సలు పడేది కాదు. కానీ నేడు వారు కూడా జై భీమ్ అనక తప్పడం లేదు అన్నారు.
అమెరికా తీరుపై సభలో ఆందోళన
అమెరికానుంచి ఇండియాకు డిపోర్ట్ అవుతున్న భారతీయులను ఆదేశం వెనక్కు పంపుతున్న అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. అమానవీయంగా కాళ్లు, చేతులు కట్టేసి పంపుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంతుకుముందు కాంగ్రెస్ మండి పడింది. దీనికి కౌంటర్ గా బీజేపి నేతలు కాంగ్రెస్ అనైతిక విధానాలకు పెట్టింది పేరని, ఎమర్జెన్సీ విధింపే ఒక ఉదాహరణ అని, జవహార్ లాల్ పాలన కూడా ఒక ఉదాహరణ అనీ తిప్పి కొట్టారు. ఎమర్జెన్సీ టైమ్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని, దేశం మొత్తం నియంతృత్వపు ఉక్కు పాదాల కింద నలిగిపోయిందని బీజేపి నేతలు గుర్తు చేశారు. నెహ్రూ పాలనలో ఓక నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు, ఓ కవిత గానం చేసినందుకు ప్రముఖ కవి మజ్రూ సుల్తాన్ పురీని జైలు పాల్జేశారని బీజేపి ఎంపీలు విమర్శించారు. ఇక బాలీవుడ్ నటుడు బల్ రాజ్ సహాని ఒక ఆందోళనలో పాల్గొన్నందుకు జైలుకు పంపారని, లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ వీర్ సావర్కర్ పై పాట పాడినందుకు అతనిపై కొన్నేళ్ల పాటు నిషేధించారని బీజేపి నేతలు గుర్తు చేశారు.