- ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న రేవంత్ రెడ్డి.
- సమస్యలు ఉంటే నాకు చెప్పండి నేరుగా రాహుల్ గాంధీ కైనా చెప్పవచ్చు.
- రాహుల్ గాంధీని కలుస్తానంటే నేనే అపాయింట్మెంట్ తీసుకుంటాను.
- గ్రూప్ మీటింగు డిన్నర్ సమావేశ లపై జాగ్రత్తగా ఉండండి.
- సూర్యాపేట గజ్వేల్ లో రెండు భారీ బహిరంగ సభలు.
- నియోజకవర్గాల వారిగా నిధుల కేటాయింపును వివరించిన భట్టి విక్రమార్క.
- తాను పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నా అనిరుద్ రెడ్డి
ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఆసక్తికరంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం సుమారు ఐదు గంటల పాటు సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కుల గణన ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై రేవంత్ రెడ్డి మాట్లాడగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపు గురించి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినట్టుగా తెలిసింది. ఇక ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సుత్తిమెత్తగానే కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పినట్టుగా సమాచారం. ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ లైన్ క్రాస్ కావద్దని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని లేకపోతే పార్టీ దృష్టికి తీసుకురావాలని అలా కాకపోతే నేరుగా రాహుల్ గాంధీని కలవాలంటే తానే అపాయింట్మెంట్ ఇప్పిస్తారని రేవంత్ రెడ్డి శాసనసభ్యులతో అన్నట్లు తెలిసింది.
డిన్నర్ పార్టీలు గ్రూప్ మీటింగ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీడియాకు తెలిసేలా హడావిడి చేసుకోవద్దని ఆయన సూచించారు. కులగణన, వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని పది రోజుల్లో బీసీ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శాసనసభ్యులకు సూచించారు.ఎస్సీ వర్గీకరణ పై సూర్యాపేటలో ఒక బహిరంగ సభ బీసీ రిజర్వేషన్లపై గజ్వేల్ లో ఒక సభను పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ నిధుల విషయంలో అన్ని నియోజకవర్గాలకు న్యాయం చేస్తున్నామని ఎక్కడే సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మరోవైపు ఎమ్మెల్యేల మీటింగ్ సంబంధించి కేంద్ర బిందువైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఈ సమావేశంలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. తాను పార్టీకి గాని ముఖ్యమంత్రికి గాని వ్యతిరేకం కాదని తన నియోజకవర్గంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గత ప్రభుత్వ హాయంలో భూ అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని మాత్రమే తాను కోరినట్టుగా ఆయన తెలిపారు.