- జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఒప్పందం
- రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జిఎన్ యూ
- మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం రాబోతోంది. ప్రతిష్టాత్మకమైన జార్జియా నేషనల్ యూనివర్శిటీ (జీఎన్‌యు) ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎన్‌యు ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిఎన్ యు, ఎపి ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్‌యు సుమారు రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతోపాటు 500మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడంతోపాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న మా ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిఎన్ యు వ్యవస్థాపకుడు, రెక్టార్ డాక్టర్ గియా కావ్టెలిష్విలి, విద్యావ్యవహారాల వైస్ రెక్టార్ ప్రొఫెసర్ జార్జ్ గవ్తాడ్జే, అడ్మినిస్ట్రేటివ్ ఎఫైర్స్ వైస్ రెక్టార్ డాక్టర్ గొడెర్జి బుచాష్విలి, ఫైనాన్స్ అండ్ రిసోర్సెస్ వైస్ రెక్టార్ లెవాన్ కలందరిష్విలి, ఇండియా ఆపరేషన్స్ అండ్ అడ్మిషన్స్ డైరక్టర్ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి, ఆత్మీయ ఎడ్యుకేషన్ ఫౌండర్, చైర్మన్ హష్మిక్ వాఘేలా, సిఇఓ చిరాగ్ వాఘేలా, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ భరత్ గుప్త, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.