ఇల్లే స్వర్గసీమ అన్నది మునుపటి మాట. ఇప్పుడు ఆ ఇళ్లే ఆడపిల్లల పాలిట మరణ మృందంగాలు అవుతున్నాయి. రక్షించాల్సిన సొంత వారే భక్షిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఇది కఠిన వాస్తవం. ఆడపిల్లలు, మహిళలకు సొంత ఇల్లే అత్యంత ప్రమాదకర ప్రాంతం. హత్యకు గురైన మహిళల్లో 60 శాతం మందిని పొట్టన పెట్టుకుంది సొంత భాగస్వాములు, కుటుంబ సభ్యులే. నిర్ఘాంతపోయే ఈ వాస్తవాలను ఐక్యరాజ్య సమితి నివేదిక బయటపెట్టింది.
తాజాగా యూఎన్ గ్లోబల్ ఫెమిసైడ్ నివేదిక -2023 ను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితికి చెందిన యూఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం ‘మహిళలపై హింస నిర్మూలనా అంతర్జాతీయ దినోత్సవం’ సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న గృహ హింస, హత్యలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేసింది. 36 పేజీల ఈ నివేదకలోని గణాంకాలు చూస్తే మహిళలకు సమాన హక్కులు, మహిళల భద్రత, మహిళా సాధికారత అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనం బయటపడుతోంది.
గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 85 వేల మంది మహిళలు హత్యకు గురైతే వీరిలో 60 శాతం అంటే 51,100 మందిని హత్య చేసింది వారి సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యులే. సగటున రోజుకు 140 మంది అమ్మాయిలు, మహిళలు సొంత వారి చేతిలోనే గృహ హింసకు, హత్యకు గురవుతున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ గృహహింసకు బలవుతోంది. మహిళలపై హింస, వివక్ష విషయంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఒకే రకమైన ధోరణులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందటానికి, వెనుకబాటుతనానికి సంబంధం ఉండటం లేదు.
ఆఫ్రికా ఖండంలో మహిళలపై దాడులు, హత్యలు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 85 వేల మంది మహిళలు, అమ్మాయిలు హత్యకు గురైతే వీరిలో నాలుగో వంతు అంటే 21వేల 700 హత్యలు ఆఫ్రికా ఖండంలోనే జరిగాయి. ప్రతి లక్ష మందిలో 2.9 మహిళలు సమీప భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని చేతిలో హతం అయ్యారు. పేదరికం, వెనుకబాటుతనం ఎక్కువగా ఉండే ఆఫ్రికా ఖండం మొదటి స్థానంలో ఉంటే, అత్యంత అభివృద్ధి చెందిన, స్వేచ్ఛకు మారుపేరుగా భావించే అమెరికా ఖండం రెండో స్థానంలో ఉంది.
సమీప భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని చేతుల్లో మహిళల హత్యల విషయంలో ఆసియా ఖండం నాలుగో స్థానంలో, ఐరోపా ఖండం 5వ స్థానంలో ఉంది. స్థూలంగా మహిళలపై వివక్ష, గృహ హింస ఒకే రకంగా ఉన్నా…పశ్చిమ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య స్వల్ప తేడా కనిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల్లో మహిళలు ఎక్కువగా సన్నిహిత భాగస్వామి చేతుల్లో హతమవుతుండగా… ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో మాత్రం అత్యధికంగా కుటుంబ సభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యారు.
ఇటువంటి తీవ్ర వివక్ష సమాజానికి శ్రేయస్కరం కాదు. మహిళల పై వివక్ష, దాడులు, హత్యలు తగ్గాలంటే మార్పు ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి. సమాజ ఆలోచన ధోరణిలో మార్పు రావాలి.