- కులగణన చేయమంటే మంగళ సూత్రాలంటారా?
- బీజేపి పై సూటైన, పదునైన భాషతో వయనాడ్ ఎంపీ తొలి పలుకులు
ప్రతిపక్షంపై సూటి విమర్శలు, రాజ్యాంగం ప్రస్తావన, ఆవశ్యకత,ఇందిర కుటుంబ త్యాగాలు, ఎన్డీఏ ఏలుబడిలో సామాన్యుడి కష్టాలు.. పార్లమెంటులో కాంగ్రెస్ భవిష్యత్ ఆశాకిరణం ఇందిర వారసురాలు ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగంలో చెణుకులివి..ప్రసంగం మొత్తం సూటిగా, స్థిరంగా, ప్రతిపక్షాన్ని ఎత్తి పొడుస్తూ పదునైన విమర్శలతో తొలి ప్రసంగంలోనే హిట్ మార్కులు కొట్టేశారు ప్రియాంకా గాంధీ. రాజ్యంగానికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు లో ఇవాళ చర్చ జరిగింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ ప్రారంభించిన ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ఎంపీగా తొలిసారి సభలో అడుగు పెట్టిన ప్రియాంకా గాంధీ అద్భుతమైన ప్రసంగం చేశారు.రాజ్యాంగం అంటే ఆరెస్సెస్ రూల్ బుక్ కాదని విరుచుకు పడ్డారు. 2017లో ఉన్నవ్ లో అఘాయిత్యం దగ్గర నుంచి నిన్న మొన్నటి సంభాల్ ఘర్షణల వరకూ ప్రతీ అంశాన్ని సూటిగా ప్రస్తావించి ఎన్డీఏ పాలనపై ఎదురు దాడి చేశారు. వయనాడ్ నుంచి లలిత్ పూర్ వరకూ రైతుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయన్నారు. ప్రియాంక ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు ఆద్యంతం బల్లలు, చరుస్తూ ఉత్తేజంతో ప్రోత్సహించారు.
రాజ్యాంగాన్ని తిరగ రాయాలన్న బీజేపి ప్రయత్నాలపై పదునైన విమర్శలు చేసిన ప్రియాంక దేశంలో కుల గణన జరపాలన్న ప్రతిపక్షం వాదనను గట్టిగా సమర్దించారు. జ్ నాధ్ సింగ్ రాజ్యాంగంపై ప్రారంభించిన చర్చకు ప్రియాంక స్పందనగా చేసిన ఈ ప్రసంగంలో ప్రతిపక్షాలపై ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థలు విపక్షాల పై ఈడీ, ఐటి రైడ్స్ జరపడాన్ని బీజేపీ మార్క్ ఉతుకుడు అంటూ వాషింగ్ మిషన్ సెటైర్ తో ప్రియాంక నవ్వులు పూయించారు.
రాజ్యాంగం మనకి స్ఫూర్తి
కొద్ది రోజుల క్రితం సంభాల్ అల్లర్లలో తీవ్రంగా నష్టపోయిన కొందరు తనను కలిసేందుకు వచ్చారని అద్నన్, ఉజైర్ అనే ఇద్దరు పిల్లలు తనను కలసి వారి పరిస్థితి వివరించారన్నారు. టైలరింగ్ చేసే తండ్రి పోలీస్ కాల్పుల్లో చనిపోవడంతో తమ కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని, డాక్టర్ చదవాలన్న తన లక్ష్యం చిదిమేశారని.. అయినా కష్టపడి చదివి తాను డాక్టర్ అయ్యి తండ్రి కలలు నెరవేరుస్తానని అద్నన్ అన్నాడని అది రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తి అని ప్రియాంక అన్నారు.
సురక్షా కవచం ధ్వంసం…
చాలా నెమ్మదిగా, స్పష్టంగా, సూటిగా ప్రసంగించిన ప్రియాంక బీజేపిపై పదునైన విమర్శలు చేశారు. రాజ్యాంగం మనకు భద్రత కల్పించే ఒక సురక్షా కవచం.. కానీ గత పదేళ్లుగా గొప్పగొప్ప కబుర్లు చెప్పే అధికార పక్షం (బీజేపీని ఉద్దేశించి) ఆ రక్షా కవచానికి తూట్లు పొడిచిందన్నారు.రక్షా కవచాన్ని ధ్వంసం చేసే పని ఇప్పటికే మొదలైంది. బీజేపీ ఇక మూడోసారి కూడా గెలిస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తుంది అన్నారు. ప్రియాంక కామెంట్లకు సోదరుడు రాహుల్ గాంధీతో సహా సభ్యులంతా అరుస్తూ, మద్దతుగా బల్లలు చరిచారు.
కుల గణన అంటే… మంగళసూత్రాలంటారా?
దేశ వాస్తవిక పరిస్థితులు తెలుసుకోవాలంటే కులగణన అనివార్యమన్న ప్రియాంక అధికార పక్షం మాత్రం ఈ విషయం మాట్లాడకుండా మంగళసూత్రాలగురించి మాట్లాడుతోందని ప్రధాని మోడీని పరోక్షంగా ఎద్దేవా చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రజల మంగళసూత్రాలను చొరబాటు దార్లకు అప్పచెబుతుందన్న విమర్శను ప్రియాంక ప్రస్తావించారు.కాంగ్రెస్ గెలిస్తే మంగళసూత్రాలు, బంగారం దోచేస్తుందన్నారు. ఈ దేశాన్ని 55 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. ఎవరి మంగళ సూత్రాలనైనా దోచుకుందా? ఎవరి బంగారమైనా పోయిందా? ఇందిరాగాంధీ దేశం కోసం తన బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. మా అమ్మ సోనియా తన మంగళ సూత్రాన్ని త్యాగం చేశారు. కులగణన చేయాలన్నది దేశ ప్రజల డిమాండ్. చేస్తేనే ప్రజలకు ఏం కావాలన్నది స్పష్టత వస్తుంది. విధానాలు, పాలసీలు అందుకు అనుగుణంగా డిజైన్ చేయచ్చు అని ప్రియాంక అన్నారు.కులగణన చేయమంటే ఆ బాధ్యతను గాలి కొదిలి…1929 నాటి ఘటనలను ప్రస్తావిస్తూ,నెహ్రూ చర్యలనూ ప్రస్తావిస్తూ కాలక్షేపం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? అని ప్రియాంక నిలదీశారు.