వేదిక ఏదైనా… సందర్భం ఏమైనా… పొగడరా మీ నేత చంద్రబాబుని అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తయారయ్యాయి. ముఖ్యంగా చంద్రబాబు క్యాబినేట్ లో ఇరువు మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ చంద్రబాబు కూడా సిగ్గుపడేలా పొగిడేస్తున్నారనే వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. అది ఏ కార్యక్రమమైనా ఈ ఇరువురు మంత్రులు చంద్రబాబుని ఆకాశానికెత్తెస్తున్నారు. వీరిరువురు బాబుకు చేస్తున్న ముఖ స్తుతి చూసి మిగిలిన మంత్రులు తమకెక్కడ తక్కువ మార్కులు పడతాయో అని తెగ ఆందోళన చెందుతున్నారు. ఆ ఇద్దరు మంత్రుల్లా తాము చంద్రబాబును కీర్తించలేక నానా తంటాలు పడుతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు మంత్రులు బాబుని ఎందుకు అంత పొగుడుతున్నారు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.
మొన్న బుధ, గురు వారాల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. సాధారణంగా కలెక్టర్ల సమావేశంలో పరిపాలనా పరమైన అంశాలు, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాల్లో కలెక్టలర్లు ఏవిధంగా అమలు చేస్తున్నారు అనే అంశాలపై చర్చలు జరుగుతాయి. అలాగే ప్రభుత్వ విధానాలను కలెక్టర్లకు స్పష్టంగా చెప్పడం, కలెక్టర్లు జిల్లా అధికారులు ఏఏ అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనే విషయంలో స్పష్టత ఇవ్వడం… ఇలా కొనసాగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే రెండో సారి నిర్వహించిన కలెక్టర్ల సమావేశం చంద్రబాబు సన్మాన కార్యక్రమంగా మార్చేశారు ఆ ఇద్దరు మంత్రులు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా…? వేరే ఎవరో కాదు ఒకరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా రెండోవారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వీరిద్దరూ ఏ కార్యక్రమం జరిగినా చంద్రబాబును పొగడడమే పనిగా పెట్టుకుని పొగుతున్నారు.
కలెక్టర్ల సమావేశం మొదటి రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగంలో చంద్రబాబు నాయకత్వంలో పని చెయ్యడం మన అదృష్టమని సమావేశంలో ఉన్న అందరినీ కలుపుకుని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన గత పాలనని, ప్రస్తుతు పాలన్ని కూడా ఆకాశానికెత్తేశారు. ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే చంద్రబాబుని గుడ్డిగా ఫాలో అయిపోడంతే అని కలెక్టర్లకు ఉచిత సలహా పడేశారు. పది యూనివర్శిటీల్లో నేర్చుకోలేనిది చంద్రబాబు వద్ద నేర్చకోవచ్చని మంత్రి కేశవ్ మాట్లాడిన మాటలు అక్కడున్న అందరికీ అతిశయోక్తిలా అనిపించినట్లు సమావేశంలో ఉన్న పలువురు వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగలేదు కేశవ్ తన ప్రసంగం అంతా చంద్రబాబు అలా… చంద్రబాబు ఇలా అంటూ స్తుతిస్తూనే కొనసాగించారు.
ఇక శుక్రవారం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా కూడా పయ్యావుల, పవన్లు బాబుపై చేసిన పొగడ్తలు శృతి మించి రాగనపడ్డాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నేడు చంద్రబాబు చేసిన ఆలోచన రేపు దేశం చేస్తుందని పయ్యావుల అంటే… నాడు చంద్రబాబు విజన్ 2020 అప్పటి నా స్ధాయికి అర్ధం కాలేదని, చంద్రబాబు ఆయన కోసం కలలు కనకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న మహానాయకుడని నాకు ఇప్పుడు అర్ధమయ్యిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడినంత సేపు పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్ లిద్దరూ పోటీలు పడి మరీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేశారు. అయితే వీరిద్దరూ చంద్రబాబును ఈ విధంగా కీర్తించడం చాలా ఎబ్బెట్టుగా ఉందని టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.