తెలంగాణలో మొన్న టీవీ 9 జర్నలిస్టు రంజిత్‌పై నటుడు మోహన్ బాబు దాడికి పాల్పడ్డాడు. దాడి అనేకంటే ఓ రకంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిన్నటికి నిన్న కడప జిల్లాలో సాక్షి మీడియా జర్నలిస్టులపై టీడీపీకి చెందిన మూకలు దాడిచేశాయి. సాక్షి టీవీ ప్రతినిధి శ్రీనివాస్, సాక్షి పత్రిక ప్రతినిధి రాజారెడ్డి, కెమెరామెన్ రాములులకు తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ల దాడిలో సాక్షి టీవీ కెమెరా కూడా ధ్వంసమయ్యింది.
మోహన్‌బాబు ఇంట్లో గొడవకు సంబంధించి ఆయన కుమారుడు మంచు మనోజే మీడియాను వెంట తీసుకెళ్లారు. తన తండ్రి ఇంట్లోకి రానీయడం లేదని, ఆస్తులు పంచి ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో ఆరోపించిన మనోజ్.. మీడియా ప్రతినిధులను వెంట తీసుకొని వెళ్లారు. అయితే, మోహన్‌బాబు మీడియా మైక్‌ను లాక్కొని మరీ టీవీ9 జర్నలిస్టు రంజిత్‌పై దాడి చేశారు. ఈ దాడిలో రంజిత్ ఆసుపత్రి పాలయ్యాడు. సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇంకా రంజిత్ కోలుకోలేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఘటన మరిచిపోకముందే.. అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ మీడియాపై మరో దాడి జరిగింది. నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో కవరేజీకి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేశారు టీడీపీ శ్రేణులు. రాళ్లు, కర్రలతో జర్నలిస్టులపై దాడిచేయడం చూస్తే పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. లివెందుల నియోజకవర్గంలోని వేముల తహశీల్డార్ ఆఫీస్ వద్ద ఈ సంఘటన జరిగింది. దాదాపు 50 మంది టీడీపీ మూకలు ఒక్కసారిగా సాక్షి మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. వెంటపడి మరీ.. విచక్షణా రహితంగా రాళ్లు, కర్రలతో కొట్టారు. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు తవ్ర గాయాలయ్యాయి.